హాలియా, డిసెంబర్ 29: సాగర్ నియోజకవర్గంలోని ఎక్సైజ్ అధికారులు వైన్స్ ప్రసాద్ అనే వ్యక్తి చెప్పినట్లు నడుచుకుంటూ తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారి వేధింపులు భరించలేకున్నానని, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం ఒక్కటే శరణ్యమంటూ హాలియాకు చెందిన మద్యం వ్యాపారి విద్యాసాగర్‌రెడ్డి ఆరోపించారు. తనకు ఏదైనా జరిగినా.. ఎక్సైజ్ అధికారుల వేధింపులు తట్టుకోలేక మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నా అందుకు జిల్లా ఎక్సైజ్ అధికారులతోపాటు వైస్స్ ప్రసాద్‌దే బాధ్యత అన్నారు.
ఈ ఘటన నియోజకవర్గంతోపాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సోమవారం హాలియాలోని ఆర్అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యాసాగర్‌రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్న ప్రసాద్ తాను కలసి 1980 నుంచి మద్యం వ్యాపార చేస్తున్నామన్నారు. అభిప్రాయ భేదా లు రావడంతో విడిపోయామన్నారు. అప్పటి నుంచి వైన్స్ ప్రసాద్ ఎక్సైజ్ అధికారులతో కలసి తనను అర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో తన సమీప బంధువుల పేరుతో పెద్దవూరలో మద్యం దుకాణం అలాటైందన్నారు. దీంతో తాను నెల రోజులుగా పెద్దవూరలో మద్యం దుకాణం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నానన్నారు.
అయితే ఎక్సైజ్ అధికారులు ఇప్పటికీ తనకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు వైన్స్ ప్రసాద్ ఎక్సైజ్ అధికారులతో కలిసి నాటకం ఆడుతున్నారన్నారు. మద్యం దుకాణం ప్రారంభించకుంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. పెద్దవూరలో మద్యం దుకారణం కోసం ప్రభుత్వానికి రెంటల్‌తో పాటు రూ.కోటి డిపాజిట్ చేశానని, అయినప్పటికీ అధికారులు దుకాణానికి అనుమతి ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నించారు. వైన్స్ ప్రసాద్ తనపై తప్పుడు ఫిర్యాదులు చేయించడంతో సాగర్‌లో తన పేరిట ఉన్న మద్యం దుకాణాన్ని వారం రోజు ల్లో మరో చోటకు మార్చాలని అధికారులు తనపై వత్తిడి చేస్తున్నారని, నోటీసులు కూడా జారీ చేశారన్నారు. సాగర్‌లో ఎక్కడా రిజిస్టర్ ల్యాండ్ లేదని ఉన్నదంతా ఎన్ఎస్పీ స్థలమేనన్నారు.
మున్సిపల్ కార్యాలయ సమీపంలో తాను, వైన్స్ ప్రసాద్ పక్క పక్కనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. అయితే అధికారులు ప్రసాద్ వైన్స్ షాప్ నిర్వహించుకోవడానికి అనుమతిస్తున్నారు కానీ, తనను మాత్రం మరో ప్రాంతానికి మార్చుకోవాలని వత్తిడి తెస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తిరుమలగిరిలో ఉన్న తన మద్యం దుకాణాన్ని ప్రసాద్ ప్రోద్బలంతోనే ఎక్సైజ్ అధికారులు చిన్న చిన్న సాకులు చూపి సీజ్ చేశారని తెలిపారు. పెద్దవూరలో కూడా దుకాణం ఏర్పాటు చేయకుండా నెలరోజులుగా ఎక్సైజ్ అధికారులు తనను అడ్డుకుంటున్నారన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఎలాం టి సీసీ పుటేజీలు లభించకుండా గత రాత్రి పెద్దవూర మద్యం షాపులో ఉన్న సీసీ కెమెరాలు, ఫ్రిజ్‌లను ధ్వంసం చేశారని తెలిపారు. తన లైసెన్స్‌ను ప్రసాద్‌కు ఇవ్వమని పరోక్షంగా ఎక్సైజ్ అధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నారని విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు.
పురుగుల మందు డబ్బాతో నిరసన
ఎక్సైజ్ అధికారుల ధోరణికి నిరసనగా సోమవారం విద్యాసాగర్ రెడ్డి హాలియా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. తనకు ఏదైనా హాని జరిగినా లేక ఆత్మహత్యకు పాల్పడినా ఎక్సైజ్ శాఖ అధికారులదే బాధ్యత అన్నారు. వైన్స్ ప్రసాద్ తన పరపతిని ఉపయోగించి అధికారులపై వత్తిడి తెచ్చి తన లైసెన్స్‌ను రద్దు చేయించడమో.. లేక బలవంతంగా లాక్కోవాలనో చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెద్దవూరలోని తన మద్యం దుకాణానికి అనుమతి ఇవ్వడంతో పాటు సాగర్‌లో ఇప్పుడున్న చోటనే మద్యం దుకాణం కొనసాగించేందుకు, తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో సీజ్ చేసిన మద్యం దుకాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ విషయమై సీఐ కల్పనను వివరణ కోరగా తాము ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని తెలిపారు. తన పరిధిలో ఉన్న నిబంధనల మేరకే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.