నీలగిరి, ఏప్రిల్ 2 : జిల్లా కేంద్రంతో పాటు, మున్సిపల్ కేంద్రాల్లో, డెస్కుల్లో పనిచేసే ప్రధాన పత్రికల్లోని ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డులు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని, సీఎంతో మాట్లాడాతామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రధాన పత్రికల జర్నలిస్టులు మంత్రిని, శాసన మండలి చైర్మన్‌ను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జిల్లా, మున్సిపల్ కేంద్రాల్లో పనిచేసే ప్రధాన పత్రికల రిపోర్టర్లకు, డెస్కు జర్నలిస్టులకు కొత్త జీవోతో అక్రెడిటేషన్లు వచ్చే పరిస్థితి లేదని వివరించారు. గతంలో ఇచ్చిన మాదిరిగానే ఈసారి కూడా ప్రధాన పత్రికల్లో పనిచేసే ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎవరూ ఆందోళన చెందవద్దని సీఎం, ఐఅండ్‌పీఆర్ కమిషనర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు కమిషనర్ తోనూ చర్చించి అక్రెడిటేషన్ సమస్య పరిషారం కోసం కృషి చేస్తానని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల బ్యూరో ఇంచార్జీలు మర్రి మహేందర్ రెడ్డి, చింతకింద గణేశ్, చల్లా సాంబశివారెడ్డి, ఎడిషన్ ఇంచార్జీలు కల్యాణ నాగేశ్వరరావు, బొడ్డు జనార్దన్‌రెడ్డి, సీనియర్ రిపోర్టర్లు పులి మామిడి మహేందర్ రెడ్డి, మీసాల శ్రీనివాస్, గుండాల యాదగిరి, జిన్నా శ్రీనివాస్ రెడ్డి, పోగుల రమేష్, ఆర్. ఆకాశ్, కట్ట సుధాకర్ పాల్గొన్నారు.