సూర్యాపేట, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : వారం రోజుల్లో బతుకమ్మ పండుగ.. ఆ వెంటనే దసరా.. పండుగ పూట అంతా సంతోషంగా ఉండాల్సిన సమయంలో సూర్యాపేటలో మాత్రం ఓ పదిహేను వందల కుటుంబాలకు కంటి మీద కునుకు కరువైంది. హైదరాబాద్‌లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలు ఇక్కడి వారిలో భయాందోళనలు నింపుతున్నాయి. జిల్లాకేంద్రంలోని సర్వే నెంబర్ 247లో ఉన్న సద్దుల చెరువు చుట్టూ శ్రీశ్రీనగర్, హైటెక్ కాలనీ, మానసనగర్, హైమానగర్, నెహ్రూనగర్, ఏవీ ఎన్క్లేవ్ కాలనీలు ఏర్పాటయ్యాయి.
ఇవన్నీ అదే సర్వే నెంబర్లో ఉన్నాయంటూ మూడు రోజులుగా ఇరిగేషన్ అధికారుల బృందం చెరువు కట్ట నుంచి సుమారు రెండు వందల మీటర్ల దూరం అవతల ఎఫ్టీఎల్ జోన్‌గా మార్కింగ్ చేస్తున్నది. కాగా, పైసా పైసా పోగేసుకుని దశాబ్దాల క్రితం నిర్మించుకొని నివాసం ఉంటున్న తమ ఇండ్లను ఇప్పుడు కూల్చితే తమ పరిస్థితి ఏంటని ఆయా కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. పదిహేను రోజులుగా హైదరాబాద్‌లో చెరువులు, కుంటలను కబ్జా చేసి నిర్మాణాలు చేశారంటూ రేవంత్ సర్కార్ పొక్లెయిన్లు, డోజర్లు పెట్టి వందలాది పోలీసులతో పేద, మధ్య తరగతి ప్రజల నివాసాలపైకి యుద్ధం చేసినట్లుగా వెళ్లి కూల్చివేతలకు పాల్పడుతున్నారు.
ముఫై, నలభై ఏండ్ల కింద నిర్మించుకున్న ఇండ్లను నిలువునా కూల్చేస్తున్నారు. ఈ దృశ్యాలు, బాధితుల ఆక్రందనలను చూస్తున్న జనం తల్లడిల్లుతున్నారు. ఆ కూల్చివేతలు జిల్లాల్లో ప్రారంభమైతే తమ పరిస్థితి ఏంటని కలవరపడుతున్నారు. మూడు రోజులుగా జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు చూట్టూ ఇరిగేషన్ అధికారులు చెరువుకు సంబంధించి సర్వే ద్వారా ఎఫ్టీఎల్ ఎంతవరకు ఉందో గుర్తించి మార్కింగ్ చేస్తుండగా సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
1,500 ఇండ్లకుపైనే ఎఫ్టీఎల్లో…
సర్వే నెంబర్ 247లో సద్దుల చెరువు 115 ఎకరాల్లో ఉండగా కుచించుకుపోయి నేడు సుమారు 80 ఎకరాలకు చేరింది. 25 ఏండ్ల క్రితమే చెరువు చుట్టూ కట్ట నిర్మాణం చేయగా బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆ కట్టను ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దారు. చెరువు శిఖంలోకి 30 నుంచి 40 ఏండ్లుగా పేదలు కొద్దికొద్దిగా వచ్చి ఇండ్లు నిర్మించుకున్నారు. నేడు ఆ ప్రాంతాల్లో 1,500 వరకు ఇండ్లు ఉంటాయనేది అంచనా.
చెరువు చుట్టూ శ్రీశ్రీనగర్, హైటెక్ కాలనీ, మానసానగర్, హైమానగర్, నెహ్రూనగర్, ఏవీ ఎన్ైక్లెవ్ కాలనీ ఉన్నాయి. ఇక్కడి ఇండ్లకు అధికారులు డోర్ నెంబర్లు ఇచ్చారు. చాలావరకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. రోడ్లు, డ్రెయినేజీ, నల్లా కనెక్షన్, వీధి లైట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆయా కాలనీల్లో పెద్దపెద్ద భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణాలే కాదు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు సైతం నిర్మించారు.
ఇప్పుడు వచ్చి మార్కింగ్
30 నుంచి 40 ఏండ్ల క్రితం నిర్మించిన ఇండ్లు చెరువులో ఉన్నాయంటూ మూడు రోజులుగా ఇరిగేషన్ అధికారుల బృందం చెరువు కట్ట నుంచి సుమారు రెండు వందల మీటర్ల దూరం అవతల ఎఫ్టీఎల్ జోన్‌గా మార్కింగ్ చేస్తున్నారు. ఆయా కాలనీల్లో ఉన్న ఇండ్ల యజమానులతో మాట్లాడుతూ డోర్ నెంబరు, యజమాని పేరు వంటి వివరాలు తీసుకుంటున్నారు. దాంతో ఇక్కడి జనం కంటి మీద కునుకు ఉండడం లేదని వాపోతున్నారు.
గుండెల్లో గుబులైతున్నది
50 ఏండ్ల కింద ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. ఇంటి నెంబర్ ఉంది. ప్రభుత్వాలు అన్ని సౌకర్యాలు కల్పించాయి. మరి ఇయ్యాల మా ఇంటికి అవతల ఎక్కడో టిక్కు పెట్టి అక్కడి వరకు చెరువు ఉందంటున్నారు. మా ఇంటిని కూల్చేస్తారో ఏమో అని గుండెల్లో గుబులైతున్నది. నేను దివ్యాంగురాలిని. ఉన్న ఇంటిని కూడా కూల్చితే నాకు
చావే దిక్కు.
-గండికోట చిన్నక్క, నెహ్రూనగర్
నా ఇల్లు కూల్చాలంటే జేసీబీ నన్ను తొక్కుకుంటూ పోవాల్సిందే
చెరువు శిఖం అంటూ అధికారులు గీతలు గీస్తున్నరంట! ఎవరైనా నా ఇండ్లు కూల్చేందుకు వస్తే జేసీబీతో నన్ను తొక్కి చంపిన తర్వాతే నా ఇంటి మీదికి పోవాల్సి ఉంటుంది. 30 ఏండ్ల కింద కట్టుకున్న ఇంటిని ఇప్పుడు కూల్లుతం అంటే నేనే కాదు.. ఎవరూ ఒప్పుకోరు.
-వాడపల్లి గురువయ్య, నెహ్రూనగర్