దామరచర్ల, జూలై 11: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు అనుసంధానంగా ఏర్పాటు చేస్తున్న రైల్వేట్రాక్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయాలని టీఎస్ జెన్కో సీఎండీ రోనాల్డ్రోజ్ అధికారులను ఆదేశించారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రెండు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి బొగ్గును సరఫరా చేసే రైల్వే లైన్ల పనులు ఇంకా పూర్తికాకపోవడంతో గురువారం ఆయన నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని జానపహాడ్ టేకాఫ్ పాయింట్ నుంచి ప్లాంటులోని కోల్మార్షిలింగ్ యార్డు వరకు రైల్వే పనులను పరిశీలించారు.
పనుల జాప్యానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వే సైడింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. అనంతరం ప్లాంటులోని టర్బయిన్లు, కంట్రోల్ రూమ్, యాష్ప్లాంట్, కోల్ స్టోరేజ్, రిజర్వాయర్, చిమ్నీలు, బాయిలర్లు, కూలింగ్ టవర్లను పరిశీలించారు.
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రెండు యూనిట్లను సందర్శించారు. అనంతరం టీఎస్ జెన్కో, బీహెచ్ఈఎల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ప్లాంటు పనుల పురోగతిని చర్చించారు. మొదటి రెండు యూనిట్లల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు సీఎండీ తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్లు అజయ్, సచ్చితానందం, సీఈలు సమ్మయ్య, పీవీ శ్రీనివాస్, జీ శ్రీనివాస్, డీఈ హనుమాన్ పాల్గొన్నారు.