నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వ ఆయకట్టుకు సాగునీటి విడుదల కోసం రంగం సిద్ధమైంది. ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం నుంచి భారీ వరద సాగర్‌కు పోటెత్తుతున్నది. దాంతో రైతుల డిమాండ్ నేపథ్యంలో సాగర్ ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శుక్రవారం సాయంత్రం 4గంటలకు ఎడమకాల్వకు నీటి విడుదలకు ఏర్పాట్లు చేశారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు నీటి విడుదలలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు.
ఎగువ కృష్ణాలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు నిండిపోయాయి. దిగువన ఉన్న నాగార్జునసాగర్ నిండాల్సి ఉంది. గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 4.64లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 3,69,866 క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లోగా వస్తున్నది.
దీంతో సాగర్ నీటిమట్టం గత పది రోజుల్లోనే 34 అడుగల మేర పెరిగి ప్రస్తుతం 537.40 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ఇంకా 53 అడుగుల మేర నీరు చేరాల్సి ఉంది. ఇక పూర్తి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గానూ గురువారం సాయంత్రం 6గంటలకు 183 టీఎంసీలుగా నమోదైంది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 24 గంటల్లోనే సాగర్‌లో 11 అడుగుల మేర నీటిమట్టం పెరిగి 22 టీఎంసీల నీరు అందనంగా వచ్చి చేరింది.
కృష్ణానది ఎగువన ఇంకా భారీ వర్షాలు కరుస్తున్నందున మరో మూడు నాలుగు రోజులు ఇలాగే వరద వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాగే కొనసాగితే వారం రోజుల్లోనే సాగర్ కూడా పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది. మరోవైపు ఇప్పటికే సాగర్ నుంచి కుడి కాల్వకు 4,152 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తాజాగా శుక్రవారం మెయిన్ పవర్ హౌజ్ ద్వారా 2,2592 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తూ దిగువకు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాగర్ ఎడమ కాల్వకు సైతం సాగునీటి విడుదలకు రంగం సిద్ధం చేశారు.
కేసీఆర్ హయాంలో వరుసగా..
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో పదేండ్లలో 2015లో మినహా వానకాలంలో ఎడమకాల్వకు సాగునీటిని విడుదల చేశారు. 2017లో మాత్రం అక్టోబర్ 31న నీటి విడుదల జరిగింది. తర్వాత వరుసగా ఆరు సార్లు సాగునీటిని విడుదల చేశారు. మిగతా అన్ని సంవత్సరాల్లోనూ ఆగస్టు నెలలో సాగునీటి విడుదల జరిగింది. 2022లో మాత్రం జూలై 28న ఎడమకాల్వకు నీటి విడుదల చేశారు. 2023లో వర్షాభావ పరిస్థితుల్లో సాగర్ నిండకపోయినా వానకాలం పంటకు ప్రభుత్వం నీళ్లిచ్చి రైతులను ఆదుకుంది. ఈ యాసంగిలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ నీళ్లు ఇవ్వలేకపోయింది.
దీంతో రైతులు ఈ సీజన్‌పై ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో సాగర్‌కు భారీగా వరద వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో రెండు తెలుగు రాష్ర్టాల్లో కలిపి దాదాపు 11లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతోపాటు ఏఎంఆర్పీ పరిధిలోని చెరువులు, కుంటలను నింపడం ద్వారా మరో లక్ష ఎకరాలకు పైగా పంటలకు భూగర్భ జలాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే రైతుల్లో చాలా మంది నారుమళ్లు పోసుకోగా మరికొందరు సిద్ధమవుతున్నారు. నారుమళ్లు ముందు సిద్ధం చేసుకున్న వారు ప్రస్తుతం నీటి విడుదలతో త్వరలోనే వరినాట్లకు కూడా సన్నద్ధం కానున్నారు.
మంత్రుల పర్యటన ఇలా..
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు శుక్రవారం సా యంత్రం 4 గంటలకు సాగునీటిని విడుదల చేయనున్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు ప్రత్యేకంగా హెలికాప్టర్లో మధ్యా హ్నం 3.20గంటలకు సాగర్‌లో ని బుద్ధవనానికి చేరుకుంటారు. అక్కడి నుంచి స్థానిక ఎం పీ, ఎమ్మెల్యేలతో కలిసి మం త్రులు 3.40గంటలకు పొట్టిచెల్మ వద్ద ఉన్న ఎడమకాల్వ హెడ్ రెగ్యులేటరీ వద్దకు చేరుకుంటారు.
సాయంత్రం 4గంటలకు గేట్లను ఎత్తి ఎడమ కాల్వలోకి నీటిని విడుదల చేస్తారు. అనంతరం 4.20గంటలకు సాగర్ డ్యామ్ వద్దకు చేరుకుని వరద ఉధృతిని పరిశీలించి విజయవిహార్‌కు చేరుకుంటారు. తిరిగి 5.30 గంటలకు బుద్ధవనంలోని హెలిప్యాడ్ నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారని నల్లగొండ కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.