కేతేపల్లి, అక్టోబర్ 30: ఎగువన కురుస్తు న్న వర్షాలతో బుధవారం రాత్రి నుంచి మూసీ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. 2023 జూలైలో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఇన్‌ఫ్లో హెచ్చు తగ్గులుగా వస్తోంది. కాగా బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వర కు హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం రావడంతో ఇన్‌ఫ్లో 17 వేల క్యూసెక్కుల నుంచి 49791.50 వేల క్యూసెక్కులకు పెరిగింది.
11 గంటల వరకు 10 క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 51 వేల 990 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మధ్యాహ్నం తర్వాత ఇన్‌ఫ్లో క్రమం గా తగ్గుతూ 33 వేల 931.55 క్యూసెక్కులకు చేరింది. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ 8 క్రస్టు గేట్ల లో 7 గేట్లను 10 అడుగుల మేర, ఒక గేటు ను 5 అడుగుల మేర ఎత్తి 47729.70 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు కుడి కాల్వకు 47.61 క్యూసెక్కుల నీటిని వదిలి, ఎడమ కాల్వకు నిలిపి వేశారు. మొత్తం 47827.66 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్తుంది. ప్రాజె క్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 643.00 (4.11 టీఎంసీలు)అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్‌ఫ్లోను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారీ మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేసినందున నదిలోకి రైతులు, మత్స్యకారులు, గొర్రెలు, మేకలకాపరులు ఎవరూ వెళ్లవద్దని సూచించారు.
భీమారం వద్ద నిలిచిన రాకపోకలు..
మూసీ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేయడంతో భీమారం వంతెన వద్ద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో భీమా రం మీదు గా సూర్యాపేట-మిర్యాలగూడ వెళ్లే వాహనాల రాకపోకలు నిలిపి వేశారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే వాహనాలను కొప్పోలు మీదుగా మళ్లించారు. భీమారం వద్ద వరద ఉధృతి పెరగడంతో నదిలోకి ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వరద తీవ్రతను తాసీల్దార్ రమాదేని, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎస్ఐ సతీ ష్, ఏవో పురుషోత్తం పరిశీలించారు.
సాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
నందికొండ, అక్టోబర్ 30: సాగర్ జలాశయంలోకి వర్షపు నీరు వచ్చి చేరుతుండటం తో బుధవారం అధికారులు డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. వరద ఉధృతిని బట్టి గురువారం ఉదయం 8 గంటల వరకు 20 క్రస్ట్ గేట్ల ద్వారా 286434 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశా రు. జలాశయంలోని ఇన్‌ఫ్లో ఆధారంగా క్రస్ట్ గేట్లను తగ్గించడం, పెంచడం చేస్తున్నారు. సాయత్రం వరకు 4 క్రస్ట్ గేట్ల వరకు తగ్గించి మళ్లీ 14 క్రస్ట్ గేట్ల ద్వారా 113400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డ్యాం ప్రధాన జలవిద్యుత్తు కేంద్ర ద్వారా 33 454 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎస్ఎల్బీసీ, ఎడమ కాల్వ, కుడి కాల్వ, వరద కాల్వల ద్వారా నీటిని విడుదల చేయలేదు. రిజర్వాయర్‌లోకి 146854 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, అదే స్థాయిలో అవుట్ ఫ్లో కొనసాగుతోంది.