సూర్యాపేట, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట దవాఖానలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు రక్షణ, వైద్య చికిత్స, సేవల నిమిత్తం విధిగా చెల్లించాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము అక్షరాల రూ.40 లక్షలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దవాఖానలోని వివిధ విభాగాల్లో సుమారు 135 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. నెలనెలా దాదాపు రూ.7లక్షల వరకు పీఎఫ్, ఈఎస్ఐ వీరికి చెల్లించాల్సి ఉంటుండగా ప్రభుత్వం నుంచి డబ్బులు డ్రా చేసి కూడా గత ఏప్రిల్ 2026 నుంచి సెప్టెంబర్ 2026 వరకు చెల్లించలేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. ఈ లెక్కన ఆరు నెలలకు కలిపి దాదాపు రూ.40 లక్షలను దిగమింగారు. ఇందులో పాత్రధారులు, సూత్రధారులు చాలా మంది ఉన్నట్లు గుసగుసలు వినినిస్తున్నాయి.
ఇందులో ప్రధాన పాత్రధారి అయిన ఓ సీనియర్ అసిస్టెంట్ పెద్ద పైరవీ చేసి ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో అక్రమాలు పరాకాష్టకు చేరుకున్నాయి. మాజీ మంత్రి, ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పట్టుబట్టి నాటి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సూర్యాపేటకు మెడికల్ కళాశాలను తెప్పిస్తే నాడు ప్రభుత్వ వైద్యం వెలుగు వెలిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రభుత్వ వైద్యం మసకబారుతోంది. నాడు అనేక రికార్డులు, అవార్డులు అందుకున్న చోట నేడు వైద్యాధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణా లోపం కనిపిస్తోంది.
బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో సాధారణ జ్వరం నుంచి మొదలుకుని, ఉచితంగా మోకాళ్ల ఆపరేషన్లు తదితర అనేక రకాల అత్యుత్తమ వైద్య సేవలను ఈ ఆస్పత్రి అందిస్తూ వచ్చింది. ప్రసవాలు, ఓపీ సేవల్లో రాష్ట్ర స్థాయిలో రికార్డులు సాధించింది. కానీ గత రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో ఆసుపత్రికి వెళితే సరిపడా మందులు లేవు… టెస్టులు కరువు… డాక్టర్లు అందుబాటులో ఉండరు… ఎవరికి వారే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పైగా అక్రమాలకు అడ్డాగా ఈ దవాఖాన మారింది. ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం వెయిటేజీ మార్కులు కలుపుకునేందుకు డబ్బులు తీసుకొని ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఇచ్చారనే ఆరోపణలూ ఉన్నాయి.
ఈ ఆసుపత్రిలో ఓ సాధారణ వ్యక్తి డాక్టర్ అవతారమెత్తినా గుర్తించలేని దుస్థితి నెలకొంది. ఆరోగ్య శ్రీ డబ్బులు పక్కదారి పట్టించారు. ప్రభుత్వం మారిన తరువాత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు మారడం తదనంతరం ఒక్కో ఉద్యోగి నుంచి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు అక్రమంగా వసూలు చేశారు. గతంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ప్రస్తుతం దవాఖానలో పాలనాపరమైన నిర్ణయాలు, కీలక వ్యవహారాలను ఓ లేడీ కాంట్రాక్టు డాక్టర్ చక్కబెడుతున్నారట. పైళ్ల కదలికల నుంచి ఏజెన్సీ వ్యవహరాల వరకు ఆమె కనుసన్నల్లోనే జరుగుతున్నాయని దీని వల్ల అసలు అధికారులు నామమాత్రంగానే మిగిలిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము పక్కదారి పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి.
దవాఖానలోని వివిధ విభాగాల్లో 135 మంది వరకు పని చేస్తుండగా వారికి 15 వేల నుంచి 26వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. వేతనాలను బట్టి ఉద్యోగుల భవిష్యత్ రక్షణ కోసం పీఎఫ్, వైద్య చికిత్సల కోసం ఈఎస్ఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే దవాఖానలో సేవలందిస్తున్న ఓ ఏజెన్సీ ఆరు నెలల పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులను ఆయా సంస్థలకు చెల్లించకుండా పక్కదారి పట్టించినట్లు తెలుస్తున్నది. ఇటీవల ఓ ఉద్యోగి తన పీఎఫ్ అక్కౌంట్ బ్యాలెన్స్ చూసుకోవడంతో ఆరు నెలలుగా చెల్లించడంలేదని తెలిసింది. ఈ విషయం ఇతరుల వద్ద ప్రస్తావించడంతో వారు కూడా చెక్ చేసుకొని తమవి కూడా జమ కాలేదని చెప్పడంతో ఈ విషయం దవాఖాన వర్గాల్లో చర్చనీయాంశంగా మా రింది.
ఏప్రిల్ 2026 నుంచి సెప్టెంబర్ 2026 వరకు కార్మికులకు సంబంధించిన పీఎఫ్, ఈఎస్ఐ కలిపి సుమారు రూ.40 లక్షలకు పైనే చెల్లించకుండా స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. విచిత్రం ఏంటంటే పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించకపోగా ఏజెన్సీ వచ్చిన వెంటనే వరుసగా పది సార్లు మీటింగులు పెట్టి చిరు ఉద్యోగులను బెదిరింపులకు గురి చేస్తూ ఒక్కొక్కరి నుంచి 30 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారు. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ రెగ్యులర్ చేసేందుకు జరిమానా ఉంటుందని ఒక్కొక్కరి నుంచి మరో రూ.5వేలు వసూలు చేశారు.
ఈ క్రమంలో దవాఖానలోని ప్రతి ఫైలు కు ఓ రేటు నిర్ణయించి అక్రమాలకు పాల్పడిన ఒక సీనియర్ అసిస్టెంట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విచారణ జరిగితే తన అక్రమాలు ఎక్కడ బయట పడతాయో అన్న భయంతో ఆయన ఉన్నతాధికారుల సాయంతో తనను తాను సరెండర్ చేయించుకొని వేరే ప్రాంతానికి బదిలీ చేయంచుకున్నట్లు సమాచారం.