నల్గొండ రూరల్, ఆగస్టు 04 : దశాబ్దాలుగా నల్లగొండ పట్టణం నడిబొడ్డులో ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన క్యాంప్ ఆఫీసుగా ఎలా మారుస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంత్రులు, రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు వచ్చినప్పుడు సేదతీరే వారని, అలాంటి గెస్ట్ హౌస్ ను క్యాంప్ ఆఫీసుగా మార్చడం వల్ల నల్లగొండకు వచ్చే అతిధులు ఎక్కడ బస చేస్తారన్నారు. క్యాంప్ ఆఫీస్ ప్రారంభ కార్యక్రమాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ మండల పోలీస్ స్టేషన్లకు తిప్పిందని ఆరోపించారు.
మంత్రికి ప్రజా సమస్యలు పట్టవని దుయ్యబట్టారు. డ్రామా బ్రదర్స్ ప్రజాదరణ కోల్పోయారని, తమకు సహకరిస్తే ఒక రకంగా సహకరించకపోతే ఇంకోరకంగా మాట్లాడడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఆది నుండి అలవాటేనని ఎద్దేవ చేశారు. మంత్రిగా పనిచేస్తున్న కోమటిరెడ్డి ఇప్పటివరకు ఒక్క రాత్రి కూడా నియోజకవర్గ కేంద్రంలో బస చేయని విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధిపై దమ్ము ధైర్యం ఉంటే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.
మంత్రి హోదాలో జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టును కోమటిరెడ్డి పూర్తి చేయించలేకపోయారన్నారు. ఆయనకు రైతుల గోస పట్టడం లేదని, కోమటిరెడ్డికి రైతుల ఉసురు తప్పక తగులుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేటికీ అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని, త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం ఖాయం అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బండార్ ప్రసాద్, వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజు యాదవ్, పోతేపాక సాంబయ్య, లింగస్వామి పాల్గొన్నారు.