పెన్పహాడ్, జనవరి 05 : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలకు సిమెంట్ రేకుల ఇల్లు కాలిపోయిన సంఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామంలో సోమవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన అందిమళ్ల శేఖర్ తన ఇంట్లో కుటుంబ సభ్యులతో గాఢ నిద్రలో ఉన్న సమయంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఇంటిలో మంటలు మండుతూ పెద్ద ఎత్తున పొగలు వ్యాపించడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన బయటికి పరుగులు తీశారు. ఫైర్ స్టేషన్కు సిబ్బందికి సమాచారం అందించగా సిబ్బంది జానయ్య, శంకర్, నవీన్, ఉపేందర్ రెడ్డి వచ్చి మంటలు ఆర్పేశారు.
మంటల్లో ఫ్రిజ్, ఫ్యాన్లు, వంట సామగ్రి, బియ్యం, బీరువా, వస్త్రాలు కాలి బూడిద అయినట్లు ఎమ్మార్వో రంజిత్ రెడ్డి, జీ పి ఓ పెరుమాళ్ల పిచ్చమ్మ తెలిపారు. గ్రామ సర్పంచ్ ముత్తినేని శ్రీనివాస్, వార్డు మెంబర్ బొల్లెద్దు లావణ్య, గ్రామ కాంగ్రెస్ నాయకుడు కేకే వెంకన్న సమక్షంలో తాము జరిపిన పంచనామా ప్రకారం రూ.3 లక్షలు నష్టం జరిగినట్లు వారు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా గ్రామ పెద్దలు కోరారు.