
సేంద్రియ పద్ధతుల్లో సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకంతో కలుగుతున్న అనర్థాలకు తోడు వాటి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తుండడంతో వేములపల్లి మండల రైతులు అటువైపు అడుగులు వేస్తున్నారు.
పంట ఉత్పత్తులకు డిమాండ్
యాసంగి సాగు పనులు మండలంలో ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి. రైతులు మాగిన పశువుల పేడ, చెరువు మట్టి వంటి వాటిని పొలాల్లో చల్లి కలియ దున్నుతున్నారు. తక్కువ పెట్టుబడితో పంటకు అధిక పోషకాలు అందించడం, చీడపీడల నివారణకు సేంద్రియ ఎరువులు దోహద పడుతుండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్ధతిలో పండించిన ఆహార ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుం డడంతో ప్రజలు కూడా వీటికి అధిక ధర చెల్లించి కొను గోలు చేస్తున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులకు కూడా లాభదాయకంగా ఉంటున్నది.
దుక్కిలోనే..
వేములపల్లి, మొల్కపట్నం, ఆమనగల్లు గ్రామాల్లోని సుమారు 50 మంది రైతులు సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. రసాయ నిక ఎరువుల ధరలు పెరుగుతుండడంతో సాగు పెట్టుబడి కూడా పెరిగింది. దీంతో రైతులు స్థానికంగా దొరికే చివికిన పశువుల పేడ, జీవాల వ్యర్థాలను వినియోగిస్తున్నారు. గ్రామాల్లో సులభంగా లభించే పశువుల పేడ, గడ్డి వంటి వాటిని మాగబెట్టి ఎరువుగా మార్చుకుంటున్నారు. ఇందు కోసం తమ ఇంటివద్ద ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించుకున్నారు. మరికొంత మంది మాగ బెట్టిన వారి నుంచి కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. ఎకరానికి సుమారు 3 నుంచి 4 ట్రాక్టర్లను దుక్కిలోనే వేసి కలియ దున్నుతున్నారు. దీంతో పాటు గొర్రెలు, మేకలను కొన్ని రోజుల పాటు రాత్రిపూట తమ పొలాల్లో పడుకో బెట్టిన అనంతరం భూమిని దున్నుతున్నారు.
సేంద్రియ ఎరువులే వాడుతున్నం
పశువుల పేడనే పొలాల్లో వేసి దున్నుతున్నాం. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల పంట బాగా పండుతుంది. ఖర్చు కూడా తక్కువే. ఇలా పండించిన పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. అందుకే చాలా మంది రైతులు వీటినే వాడుతున్నరు. సేంద్రియ ఎరువుల తయారీపై అధికారులు రైతులకు శిక్షణ ఇస్తే బాగుంటుంది.