RRR | యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : ట్రిపుల్ ఆర్ రైతుల ఆశలు ఆవిరయ్యాయి. భువనగిరి మండలంలోని త్రిపుల్ ఆర్ భూసేకరణపై ఉన్న హైకోర్టు స్టే క్లియర్ అయ్యింది. ఇన్నాళ్లుగా కొనసాగిన స్టేను హైకోర్టు ఎత్తేసింది. దీంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. రెండు, మూడు రోజుల్లో త్రీజీ నోటిఫికేషన్ విడుదల కానుంది. రైతులకు పరిహారం పెంచేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు పలు దఫాలుగా భూములు కోల్పోయిన నేపథ్యంలో మరో అదనపు పరిహారం అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ట్రిబుల్ ఆర్ ప్రాజెక్ట్‌గా ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించారు. ఉత్తర భాగంలో జిల్లా మీదుగా 59.33 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించనున్నారు. దీని పరిధిలోకి తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాలు ఉన్నాయి. 24 గ్రామాల మీదుగా రహదారి వేయనున్నారు. రాయగిరి, చౌటుప్పల్ వద్ద ఇంటర్‌ఛేంజ్ జంక్షన్లు నిర్మించనున్నారు. సుమారు 2వేల ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఇప్పటికే త్రీడీ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. భువనగిరి మండలం మినహా మిగతా మండలాల్లో అవార్డు తనిఖీ ప్రారంభమైంది. అయితే భువనగిరి మండలంలోని ఏడు గ్రామాల మీదుగా త్రిపుల్ ఆర్ రోడ్డు వెళ్తున్నది. భువనగిరి మం డలంలో 491 ఎకరాలు సేకరించనున్నారు.
త్రిపుల్ ఆర్కు రాయగిరి రైతులు భూములు ఇచ్చేందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యాదగిరిగుట్ట విస్తరణ, హైటెన్షన్ వైర్లు, గ్యాస్, జాతీయ రహరారి నిర్మాణం సమయంలో విలువైన భూములను కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ ఇక్కడి నుంచి త్రిబుల్ ఆర్ రోడ్డు వెళ్తుండటంతో ఉన్న అరకొర భూములు కూడా సర్కారు గుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నది. త్రిపుల్ ఆర్ రైతులు మాత్రం కోర్టులో బలంగా కొట్లాడుతున్నారు. తాము ఇప్పటికే మూడు దఫాలుగా వివిధ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయామని, మరోసారి ఇవ్వలేమని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గతంలో హైకోర్టు త్రిపుల్ ఆర్‌పై స్టే ఇచ్చింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి త్రిపుల్ ఆర్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించండంతో జిల్లా ఉన్నతాధికారులతోపాటు ఎన్హెచ్ఏఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 7వ తేదీన భువనగిరి మండలంలో కొనసాగుతున్న స్టేను ఎత్తివేసింది.
జిల్లా ఉన్నతాధికారులు త్రిపుల్ ఆర్‌పై పనులు వేగవంతం చేశారు. ఓ వైపు కోర్టు నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు ట్రిపుల్ ప్రాజెక్టు పనులు ముందుకు సాగేలా అధికారులు కసరత్తు చేశారు. ఇప్పటికే త్రీడీ నోటిఫికేషన్ వచ్చింది. 3జీ నోటిఫికేషన్ కోసం కసరత్తు చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో 3జీ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలిసింది. దీంతోపాటు అదనంగా మరో త్రీడీ నోటిఫిషన్ కూడా రిలీజ్ చేయనున్నారు. 3జీ నోటిఫికేషన్ జారీ చేస్తే రైతులు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడనుంది. ఆ తర్వాతి దశల్లో అవార్డులను పాస్ చేస్తారు. అనంతరం బ్యాంక్ ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ చేస్తారు.
భూసేకరణలో భాగంగా నిర్వాసితులకు పరిహారం పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరాకు రూ. 7లక్షలు పలుకుతున్నది. అధికారులు మాత్రం దీన్ని రూ. 30లక్షలకు పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాయగిరి రైతులకు ఇప్పటికే పలు దఫాలుగా భూములు కోల్పోవడంతో వారికి ప్రత్యేకంగా మరో అదనపు బెనిఫిట్స్ వచ్చేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఒక రైతు ఒకసారి కంటే ఎక్కువగా భూములు కోల్పోతే 2శాతం పరిహారం అదనంగా చెల్లించే వెసులుబాటు ఉందని అధికారులు చెబుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తామని కాంగ్రెస్ హామీల మీద హామీలు ఇచ్చింది. ఏకంగా ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ భువనగిరి పర్యటనకు వచ్చినప్పుడు స్వయంగా ప్రకటన చేశారు. అంతే కాకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు హామీలు ఇచ్చారు. ఆర్అండ్బీ శాఖ మంత్రిగా జిల్లాకు తొలిసారి విచ్చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం అలైన్మెంట్ మారుస్తామని కలెక్టరేట్లో ప్రకటించారు. మరోవైపు దక్షిణ భాగంలో మాత్రం అవసరాలకు అనుగుణంగా అడ్డగోలు మార్పులు చేస్తున్నారు. జిల్లాలోని చౌటుప్పల్ వద్ద జంక్షన్ మార్పు చేశారు. నారాయణపురం మండలంలో అలైన్మెంట్లో మార్పులు చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ నాడు ఓట్ల కోసం తమను నమ్మించి మోసం చేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ తీరుపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. తదుపరి కార్యాచరణకు ప్రణాళికి రూపొందిస్తున్నారు.