
నల్లగొండ ప్రతినిధి, జనవరి4 (నమస్తేతెలంగాణ) : నల్లగొండ అభివృద్ధిని తనకు వదిలేయాలని, కంచర్ల భూపాల్‌రెడ్డిని గెలిపించాలని గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అమలుకు చర్యలు మొదలవడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేండ్లుగా నెలకొన్న కొవిడ్ ఇబ్బందులు తొలగిపోతుండడంతో సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు. నల్లగొండ రూపురేఖలు మారుస్తామని గత నెల 29న నల్లగొండకు వచ్చిన సందర్భంగా నిర్వహించిన సమీక్షలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి అధికారులతో కలిసి నల్లగొండలో పర్యటించి అభివృద్ధి పనులపై దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ప్రస్తుతం చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఐటీ హబ్‌తో పాటు బీట్ మార్కెట్ ఆవరణలో సమీకృత మార్కెట్‌కు మంత్రులు శంకుస్థాపన చేశారు. అంతకుముందే రోడ్డు విస్తరణ పనులు కూడా మొదలుపెట్టారు. మిగిలిన నిధులను కూడా ఇస్తామన్న కేటీఆర్ ప్రకటన నేపథ్యంలో విశాలమైన రోడ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. మిగిలి ఉన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు కూడా పూర్తికానున్నాయి. వీటితో పాటు క్షేత్రస్థాయిలో సమీక్షలు మొదలుపెట్టారు. మంగళవారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వివిధ శాఖల అధికారులతో కలిసి పట్టణంలో పర్యటించారు.
ఆర్అండ్బీ, ఐబీ స్థలంలో టౌన్‌హాల్..
పట్టణ నడిబొడ్డు క్లాక్‌టవర్ సెంటర్‌కు ఆనుకుని ఉన్న ఆర్అండ్బీ ఎస్ఈ, ఇరిగేషన్ ఎస్ఈ, గ్రౌండ్ వాటర్ డీడీ కార్యాలయాలను అక్కడి నుంచి తరలించాలని నిర్ణయించారు. ఈ స్థలంలో నూతనంగా విశాలమైన టౌన్‌హాల్ నిర్మాణం చేయనున్నారు. రెండు వేల మంది కెపాసిటీతో దీన్ని నిర్మించాలని ఇటీవల ఐబీ కార్యాలయాన్ని పరిశీలించిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆ మేరకు ఇక్కడే టౌన్‌హాల్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్అండ్బీ ఎస్ఈని ఆదేశించారు. ఈ కార్యాలయాలన్నింటికీ కలిపి మరోచోట నూతన భవనం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యాలయాలకు నూతన భవనం కోసం ప్రస్తుత శిథిలావస్థలో ఉన్న టౌన్‌హాల్ స్థలంలో జీప్లస్3 భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇందులోనే ఆధునిక వసతులతో కార్యాలయాలు, విశాలమైన పార్కింగ్‌కు వీలుగా నిర్మాణాలు చేపట్టనున్నారు. అప్పటివరకు ఈ కార్యాలయాలన్నింటినీ ప్రస్తుతం ఎస్పీటీ మార్కెట్ పక్కనే ఉన్న మున్సిపల్ భవన సముదాయంలోకి షిఫ్ట్ చేయనున్నారు. దీనికోసం మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
మరోరెండు మార్కెట్లపై దృష్టి
ఇప్పటికే బీట్ మార్కెట్ ఆవరణలో సమీకృత మార్కెట్‌కు శంకుస్థాపన చేయగా మరో రెండు చోట్ల ఇలాంటి మార్కెట్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. మరొకటి బస్టాండ్ ఏరియా, ఇంకోటి జైలు ఖాన ఏరియాలో నిర్మాణం చేపట్టేలా స్థలాలను పరిశీలిస్తున్నారు. దీనిపైనా త్వరలోనే స్పష్టత రానుంది. ఒక్కో మార్కెట్లో వెజ్, నాన్‌వెజ్, పండ్లు, పూలు అన్ని ఉండేలా విశాలంగా మొత్తం 108 స్టాళ్లు ఉండలా వీటిని ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. దాంతో పట్టణానికి నలువైపులా ప్రజలకు మార్కెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు అవుతుందని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే బీట్ మార్కెట్లో నూతనంగా నిర్మించనున్న మార్కెట్‌కు టెండర్లు కూడా పూర్తయ్యాయి.
కలెక్టరేట్ సమీపంలో హెలిప్యాడ్
జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న స్థలంలో శాశ్వత హెలిప్యాడ్ నిర్మాణానికి యోచిస్తున్నారు. ఇక్కడ పొట్టి శ్రీరాములు జానపద కళాక్షేత్రానికి కేటాయించిన స్థలం అందుబాటులో ఉంది. ఇందులో ప్రస్తుతం చెట్లు, ముళ్లపొదలు ఉన్నాయి. ఈ స్థలంలో హెలిప్యాడ్ నిర్మిస్తే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఈ స్థలాన్ని తక్షణమే చదును చేయాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇక మరోవైపు వేదపాఠశాల, బ్రాహ్మణ పాఠశాల నిర్మాణం కూడా చేపట్టాలని, వీటి కోసం పానగల్ వద్ద స్థలం కేటాయించేలా చూడాలని నల్లగొండ ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డికి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచించారు.
ఎన్జీ కాలేజీ నమూనా సిద్ధం
పట్టణానికి తలమానికంగా చెప్పుకునే నాగార్జున డిగ్రీ కాలేజీకి నూతన భవన నిర్మాణం కోసం ఇప్పటికే రూ.30కోట్లతో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. మొత్తం 120 గదులతో ఆధునిక తరహాలో పట్టణానికే అదనపు హంగులు, అందం వచ్చేలా ఇప్పటికే నమూనాను సిద్ధం చేశారు. ఈ నమూనాలోనే కాలేజీని నిర్మించనున్నారు. దీంతో జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఎన్జీ కాలేజీకి విశాలమైన భవనం అందుబాటులోకి రానుంది.
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి : ఎమ్మెల్యే, కలెక్టర్
నల్లగొండ పట్టణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖలను నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా టౌన్‌హాల్, హెలిప్యాడ్, ఐబీ, ఆర్అండ్బీ, భూగర్భ జలవనరుల శాఖ కార్యాలయాల నిర్మాణాల కోసం సమగ్ర నివేదికలు రూపొందించాలని సూచించారు. మంగళవారం ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయంలో అర్అండ్బీ, ఐటీ, రెవెన్యూ, భూగర్భ జల వనరుల శాఖ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్ష చేశారు. చేపట్టాల్సిన పనులపై చర్చిస్తూ తగు నిర్ణయాలు చేశారు. అనంతరం ఆర్అండ్బీ ఎస్ఈ, ఐబీ ఎస్ఈ, ఈఈ కార్యాలయాలు, గ్రౌండ్ వాటర్ కార్యాలయం, టౌన్‌హాల్, ఎస్పీఈ మార్కెట్ దగ్గర మున్సిపల్ భవన సముదాయం, కలెక్టర్ కార్యాలయం వద్ద పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం జానపద కళాక్షేత్రానికి కేటాయించిన స్థలాలను పరిశీలించారు. అలాగే ఎంజీ యూనివర్సిటీలో వీసీ గోపాల్‌రెడ్డితో కలిసి నూతన భవనాల నిర్మాణ పనులను పరిశీలించి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఇటీవల సీఎం కేసీఆర్, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి పట్టణంలో పర్యటన నేపథ్యంలో అందుకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికపై దృష్టి సారించారు. ప్రతిపాదనలు సిద్ధం చేస్తే వాటిని ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ నరసింహ, ఈఈ నరేందర్‌రెడ్డి, ఐటీ ఈఈ జేవీ సత్యనారాయణరెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, భూగర్భ జలవనరుల శాఖ డీడీ సునీల్‌బాబు పాల్గొన్నారు.