హిమాయత్‌నగర్,ఫిబ్రవరి10 : ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ ఆటో, ప్రైవేట్ మోటార్ డ్రైవర్స్, వర్కర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వెంకటేశం ఆరోపించారు. కార్మికుల నడ్డివిరిచే దుర్మార్గమైన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 12న నిర్వహించే జాతీయ సార్వత్రిక సమ్మెలో రవాణా రంగ కార్మికులు పెద్దసంఖ్యల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. మంగళవారం హిమాయత్‌నగర్ లోని ఎస్‌ఎన్‌రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ కో-కన్వీ నర్ యాదగిరి(టీఎన్టీయూసీ), సత్తిరెడ్డి(టీఏడీఎస్),అమా నుల్లాఖాన్ (ఐఎల్ డబ్ల్యూఎఫ్), ఎంఏ సలీమ్(తెలంగాణ జాగృతి)తో కలిసి వెంకటేశం మాట్లాడారు.
ఆటో డ్రైవర్ల సామాజిక భద్రత కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఏడాదికి రూ.12వేల ఆర్థికసాయం అందించి, రూ.5లక్షల ప్రమాద బీమా,ఇండ్లు లేని వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం ఆటో, రవాణా రంగ కార్మికులు బంద్ పాటించి బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు జరిగే ర్యాలీలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో జేఏసీ నేతలు అశోక్, జంగయ్య, నరసింహ, శ్రీనివాస్, కొంరెల్లి బాబు, కృష్ణ, తిరుమలేశ్గౌడ్ పాల్గొన్నారు.