సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి… ఎక్కువగా చీకటి వేళల్లోనే జరుగుతున్నాయి. ఓఆర్ఆర్పై లైటింగ్ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయకపోవడం ప్రమాదానికి ఒక కారణమవుతుందంటూ వాహనదారులు వాపోతున్నారు. గత ఏడాది రాచకొండలో 3,488 రోడ్డు ప్రమాదాలు జరుగగా.. అందులో 76 ఓఆర్ఆర్పైనే జరిగాయి, సైబరాబాద్లో 4,608 రోడ్డు ప్రమాదాలు జరుగగా.. 152 ప్రమాదాలు ఓఆర్ఆర్పైనే జరిగాయి. 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు జరగకుండా గత ప్రభుత్వ హయాంలో ఎన్నో చర్య లు తీసుకున్నారు.
అయితే నేడు ఓఆర్ఆర్పై అధికార యంత్రాంగం పర్యవేక్షణ కొరవడింది. పెట్రోలింగ్ వాహనాలు కూడా సరిగ్గా తిరగడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఓఆర్ఆర్పై 120 కిలోమీటర్ల వేగ పరిమితి ఉంది. దీంతో చాలా సందర్భాల్లో అతివేగమే ప్రమాదానికి కారణమవుతుండగా, రోడ్లపై ఆగి ఉండే వాహనాలు కూడా దీనికి తోడవుతున్నాయి.
శివారు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరగడానికి చీకటి కూడా మరో కారణమవుతుంది. ఓఆర్ఆర్పై రాత్రి వేళల్లో అక్కడక్కడా వీధి లైట్లు పనిచేయవు.. చీకటి అలుముకుంటుంది. మరో పక్క నిద్రమత్తులో తెల్లవారుజామున ఎక్కువ ప్రమాద ఘటనలు జరుగుతున్నాయి.
