మియాపూర్ , ఫిబ్రవరి 10 : మియాపూర్ మదీనాగూడలోని వాణిజ్య భవనం సెల్లార్లో మంగళవారం ఉదయం దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఆందోళన నెలకొన్నది. జేఎస్ఆర్ మాల్ భవనంలోనే ముందు వైపు ఓ సూపర్ మార్కెట్ కొనసాగుతుండగా వెనుక వైపు డయాగ్నస్టిక్తో పాటు నారాయణ పాఠశాలలు నడుస్తున్నాయి. డయాగ్నస్టిక్కు సంబంధించిన వృథా మెటీరియిల్ను భవనంలోని రెండో సెల్లార్లో నిల్వ ఉంచారు.
వాటికి నిప్పు అంటుకోవటంతో దట్టమైన పొగలు అలుముకుని రెండు సెల్లార్లతో పాటు పాఠశాల భవనానికి తాకడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యాయి. పొగ వ్యాపించటంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది పై అంతస్తుల్లో ఉన్న విద్యార్థులందరిని కిందికి పంపించారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కొద్ది పాటి నిప్పు రవ్వలను ఆర్పివేశారు.