హాలియా, ఆక్టోబర్ 7: అనుముల మండలం పేరూరులో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో సోమ సముద్రంలోకి భారీగా వరదనీరు వచ్చిచేరింది. దీంతో చెరువు కత్వ నుంచి ఉప్పొంగిన వరద నీరు హాలియా-పేరూరు రహదారిపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది.దీంతో మండలంలోని పేరూరు, ఆంజనేయతండా, పుల్లారెడ్డిగూడెం, వీర్లగడ్డతండా, తిరుమలగిరి సాగర్ మండలంలోని చిలుకాపురం, బోయగూడెం గ్రామాలకు, మండలకేంద్రమైన హాలియాతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ ఐదు గ్రామాల ప్రజలు హాలి యా రావాలంటే కోరివేనుగూడెం మీదుగా రావాల్సి ఉంటుం ది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు మండల కేంద్రం రావాలంటే మరో పది కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి హాలియా – పేరూరు రహదారిపై లోలెవల్ బ్రిడ్జి స్థానంలో హైలెవల్ వంతెన నిర్మా ణం చేపట్టాలని కోరుతున్నారు.
ప్రతిపాదనలకే పరిమితమైన రోడ్డు, వంతెన నిర్మాణం..
మండలంలోని పేరూరులో కాకతీయుల కాలం నాటి అతి పురాతన శివాలయం ఉంది. ఈ ఆలయానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు వస్తుండటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల య అభివృద్ధికి రూ.40 లక్షలు కేటాయించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం డబుల్ రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఇంతలో ఎన్నికలు జరిగి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో హాలియా నుంచి కొంపల్లి గ్రామం వరకు ప్రతిపాదించిన డబుల్ రోడ్డు నిర్మాణం అటకెక్కింది. దీంతో వర్షం కురిసినప్పుడల్లా పేరూరు సోమసముద్రం వరద నీటి కారణంగా ఈ రహదారిపై రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభు త్వం స్పందించి డబుల్ రోడ్డుతో పాటు కత్వవద్ద హైలెవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలి..
వర్షం కురిసినప్పుడల్లా మా గ్రామంలోని సోమసముద్రం చెరువు కత్వపై నుంచి భారీగా వరదనీరు ప్రవహించడంతో హాలి యా – పేరూరు రహదారిపై రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీంతో మా గ్రామస్తులతో పాటు చుట్టూ ఉన్న ఐదు గ్రామాల ప్రజలకు ఇబ్బందిగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూతన వంతెన, డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చిన విధంగా డబుల్ రోడ్డు , హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలి.
– యడవల్లి నాగరాజు, మాజీ సర్పంచ్ సలహాదారు, పేరూరు