ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి కురిసిన గాలివాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మార్కెట్ యార్డుల్లో, కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం కుప్పలు తడిసి పోయాయి. కాంటాలు వేసిన ధాన్యాన్ని మిల్లర్లు తరలించకపోవడంతో తడిసి ముద్దయ్యింది. ధాన్యం కుప్పల చుట్టూ వాన నీరు చేరడంతో రైతులు కంటనీరు పెట్టారు. నెల రోజులైనా కొన్ని ప్రాంతాల్లో కాంటాలు పెట్టలేదని, కాంటాలు పెట్టినా మిల్లర్లు తరలించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో గాలివానకు టార్పిలిన్లు ఎగిరిపోవడంతో ధాన్యం కుప్పలు తడిసి పోయాయి. గాలివాన బీభత్సంతో పలు ప్రాంతాల్లో ఇండ్లపై కప్పులు, రేకుల షెడ్లు లేచిపోయాయి. విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది. మరికొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. చిట్యాల మండలంలో 9 ఇండ్లు పాక్షికంగా, ఒక ఇల్లు పూర్తిగా, వనిపాకలలో 5 ఇండ్లు, శివనేనిగూడెంలో 2 ఇండ్లు కూలిపోయాయి. వనిపాకల, చిట్యాల, వట్టిమర్తిలో నిమ్మ, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. చిట్యాల శివారులోని బొక్క పురుషోత్తంరెడ్డికి చెందిన నాలుగెకరాల నిమ్మ తోట, ఎకరం మామిడి తోటలో చెట్లు పూర్తిగా నేలకొరిగాయి.
చౌటుప్పల్, మే 27 : చౌటుప్పల్ మండలంలో మంగళవారం రాత్రి కురిసిన గాలివాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. స్థానిక మార్కెట్ యార్డు కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. తూకం వేసిన బస్తాలు మిల్లులకు తరలించకపోవడంతో పూర్తిగా తడిసి పోయాయి. కుప్పల చుట్టూ వరద నీరు చేరడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ 150 మంది రైతులకు చెందిన ధాన్యం కుప్పలు ఉన్నాయి. ధాన్యాన్ని విక్రయించేందుకు నెల రోజులకు పైగా రైతులు వేచి చూస్తున్నారు. మాయిశ్చర్ చూసి 14 రోజులు దాటినా కూడా కాంటాలు వేయ డం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలివానకు ధాన్యం కుప్పలపై కప్పిన టార్పిలిన్లు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కంట నీరు పెడుతున్నారు. ఆరబెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కొనుగోలు విషయంలో ప్రభుత్వ పనితీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. నెలల తరబడి కొనుగోలు చేయడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటి వరకు 50 శాతానికి పైగానే తూకం వేశారు. వానా కాలం నెత్తిమీదకు రావడంతో రైతులు మిగతా ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారంటూ ప్రశ్నస్తున్నారు. ఇలానే ఆలస్యం చేస్తే వానలకు కుప్పులు మొలకెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేళ్లచెర్వు, మే 27: మండల వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. పలు చోట్ల ఇండ్ల పై కప్పులు లేచిపోగా, మరికొన్ని చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. గాలి దుమారానికి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడి జనం చీకట్లో ఇబ్బందులు పడ్డారు. గాలివానతో మండల పరిధిలోని రేవూరులో తీవ్ర నష్టం వాటిల్లింది. పలువురి ఇండ్లపై ఉన్న రేకుల కప్పులు గాలికి ఎగిరిపడ్డాయి. తీగలు తెగిపడడంతో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. దీంతో మంచినీటి కోసం గ్రామస్తులు రోజంతా చేతిపంపులపైనే ఆధారపడ్డారు.

చిట్యాల, మే 27 : అకాల వర్షంతో చిట్యాలతోపాటు మున్సిపల్ పరిధిలోని శివనేనిగూడెం, వనిపాకల, నేరడ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ వైపు మధ్యాహ్నం వరకు మండే ఎండలతో ఇబ్బందులు పడ్డ రైతులు అకస్మాత్తుగా రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈదురు గాలులతో ప్రారంభమైన భారీ వర్షంతో ఆగమాగమయ్యారు. పండ్ల తోటల రైతులు చెట్లు నేలకొరిగి తీవ్రంగా నష్టపోగా పలు ఇళ్ల పై కప్పులు గాలికి ఎగిరిపోయాయి. చిట్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ వేప చెట్టు నేలకొరగటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసు సిబ్బంది విరిగిన చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. చిట్యాలలో 9 ఇండ్లు పాక్షికంగా, ఒక ఇల్లు పూర్తిగా, వనిపాకలలో 5 ఇండ్లు, శివనేనిగూడెంలో 2 ఇండ్లు కూలిపోయాయి. వనిపాకల, చిట్యాల, వట్టిమర్తిలో నిమ్మ, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. చిట్యాల 2వ వార్డులో కూనూరు గాలమ్మ, వనం రేణుక, చింతపల్లి నరేశ్, దండుగుల లక్ష్మమ్మ ఇండ్లు దెబ్బతిన్నాయి. చిట్యా ల శివారులో బొక్క పురుషోత్తంరెడ్డికి చెందిన నాలుగెకకరాల నిమ్మ తోట, ఎకరం మామిడి తోటలో చెట్లు పూర్తిగా నేలకొరిగాయి. 3వ వార్డులోని వాటర్ ఫిల్టర్ డబ్బా గాలికి ఎగిరి పడింది. పంట నష్టపోయిన నిమ్మ, మామిడి, బత్తాయి రైతులకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరాకు లక్ష రూపాయల నష్టపరిహారం అందించాలని బీజేపీ మండల అధ్యక్షుడు పీకె వెంకన్న డిమాండ్ చేశారు. నష్టపోయిన వారికి వెంటనే నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని సీపీఎం నాయకులు జిట్ట నగేశ్, అరూరి శ్రీను డిమాండ్ చేశారు.
రాజాపేట మే 27 : మండలంలోని పలు గ్రామాల్లో భారీ ఈదురు గాలులు ఉరుములు, మెరుపులతో కూడి వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈదురు గాలుల ప్రభావంతో రాజాపేటకు చెందిన నమిలే శ్రీహరి చెందిన నాలుగెకరాల మామిడి తోటలోని కాయలు రాలిపోయాయి. దీంతో మూడు లక్షల వరకు నష్టం వాటిల్లింది. పలు గ్రామాల్లో పెద్ద చెట్లు నేలకొరిగాయి. రోడ్లపై చెట్లు విరిగిపడడంతో రవాణా స్తంభించింది. కొన్ని ఇళ్లపై ఉన్న షెడ్లు, రేకులు గాలికి ఎగిరిపడ్డాయి. మండలంలోని మల్లెగూడెం గ్రామానికి చెందిన రైతు గొడుగు కనకయ్యకు చెందిన పాడి గేదె పిడుగు పాటుకు గురై మృతి చెందింది. ఈ ఘటనలో సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. అదే గ్రామానికి చెందిన ఐలయ్య ఇంటిపై పిడుగు పడటంతో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గ్రామాల్లో చీకట్లు అలుముకోవడంతో జనం ఇబ్బందులు ఎదురొన్నారు. అధికారులు వెంటనే నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మునుగోడు రూరల్, మే 27: మండల వ్యాప్తంగా మంగళవారం రాత్రి కురిసిన వర్ష బీభత్సానికి పలు గ్రామాల్లోని విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. దీంతో అంధకారం నెలకొంది. జమస్తాన్‌పల్లి, పలివెల, పులి పలుపుల, మునుగోడు గ్రామాల్లో నిమ్మ, మామిడి కాయలు నేలపాలయ్యాయి. జమస్తాన్పల్లికి చెందిన రేవల్లి అంజయ్య అనే రైతు సాగు చేసిన నిమ్మ, మామిడి కాయలు నేల పాలయ్యాయి. ప్రభుత్వం స్పందించి పరిహారం చెల్లించాలని అంజయ్య విజ్ఞప్తి చేశారు.