భువనగిరి కలెక్టరేట్, మే 2 : గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులతో మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇండ్లు, పశువుల కొట్టాలపై రేకులు ఎగిరిపడ్డాయి. వీరవెల్లిలో రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరగగా, రేగు మల్లేశానికి చెందిన రూ.60వేల విలువైన పశువుల కొట్టం రేకులు కొట్టుకుపోయాయి. బీఎన్ తిమ్మాపురానికి చెందిన అంగడి సుధాకర్ ఫొటో స్టూడియోపై రేకులు ఎగిరిపడ్డాయి. రూ.3 లక్షల విలువైన కంప్యూటర్లు, ప్రింటర్, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.
రామన్నపేట/రాజాపేట : రామన్నపేట మండలంలోని సిరిపురం, వెల్లంకిలో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బాచుప్పలలో జినుకుల శ్రీశైలానికి చెందిన 5 వేల కోళ్ల ఫాం నేలమట్టమైంది. పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. దుబ్బాకలో విద్యుదాఘాతంలో గుండాల సోమయ్యకు చెందిన గేదె మృతి చెందింది. రాజాపేట మండలం చల్లూరులో జంగిలి కొండల్కు చెందిన ఇంటి రేకులు ఎగిరిపోయాయి.