భారీ వర్షాలు, వరద సూర్యాపేట జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం మిగిల్చాయి. కాలనీలు, ఇండ్లల్లోకి చేరిన నీటితో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నీట మునిగిన పొలాలు రైతులకు కోలుకోలేని దెబ్బ మిగిల్చింది. రోడ్లు మరమ్మతులకు గరవడంతో రాకపోకలు అంతరాయడం ఏర్పడింది. ప్రభుత్వ నుంచి సాయం అందక వర్ష బాధితులు ఎదురుచూస్తున్నారు. ఎటు చూసినా కన్నీటి గాధలే వినిపిస్తున్నాయి.
పొలాలన్నీ ఇసుక మేటలే..
కోదాడ రూరల్, సెప్టెంబర్ 4 : భారీ వర్షాలు, వరద ధాటికి కోదాడ మండల పరిధి తొగర్రాయి, కూచిపూడి, రెడ్లకుంట, చిమిర్యాల గ్రామాలు అతలాకుతమయ్యాయి. పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వందల ఇండ్లలోని వడ్లు, బియ్యం, నిత్యావసర వస్తువులు, గడివాములు తడిశాయి. టీవీలు,ఫ్రిజ్‌లు కొట్టుకొనిపోయాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. చిలుకూరు మండల పరిధి నారాయణపురం చెరువు, గ్రామ శివారు చెరువు వర్షానికి కట్టలు తెగిపోవడంతో తొగర్రాయి, కూచిపూడి గ్రామాలు నీట మునిగాయి.
దీనికి తోడు నడిగూడెం మండలం కాగితంరామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాల్వకు పడిన గండి పడడం, పాలేరు వాగు ఉప్పొంగడంతో చిమిర్యాల, రెడ్లకుంట గ్రామాలు జలమయమయ్యాయి. పొలాలు పూర్తిగా కొట్టుకొనిపోయాయి. తొగర్రాయిలో సుమారు 250 ఎకరాలు, కూచిపూడిలో 200, రెడ్లకుంటలో 100, చిమిర్యాలలో 80 ఎకరాల పంట పొలాలు నీటి మునిగాయి. రెడ్లకుంట వాగు సమీపంలో నిర్మించి వైకుంఠధామం పూర్తిగా ధ్వంసమైనది. అధికారులు యుద్ధ ప్రాతిపాదికన విద్యుత్‌ను పునరుద్ధరించడంతోపాటు తాగునీటి సమస్యను తీర్చారు. రైతులు, ప్రజలకు ఈ వరద తీవ్ర నష్టం కలిగించింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన వారిని ఆదుకోవాలని కోరుతున్నారు.
రెండెకరాల పొలం ఇసుక మేటతో నిండింది
భారీ వరదతో వాగు పక్కన ఉన్న మా రెండెకరాల వరిపొలం పూర్తిగా ఇసుక మేటతో నిండిపోయింది. ఆ ఇసుకను తరలించాలంటే వేల రుపాయలు ఖర్చవుతుంది. కాల్వ నిండి రెండు పంటలు పండుతాయనుకుంటే వరదతో పొలం మొత్తం ధ్వంసమైంది. నాతో పాటు గ్రామంలో వందల ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. రైతులను ప్రభుత్వ ఆర్థికంగా ఆదుకోవాలి.
– బాలెబోయిన ఏడుకొండలు, రైతు, తొగర్రాయి, కోదాడ మండలం
పశువులకు మేతలేదు
నాకు నాలుగు బర్రెలు ఉన్నాయి. వాన కాలం వాటి మేత కోసం 180 గడ్డిమోపులు వామువేశాం. ఆదివారం రాత్రి వాన, వరదలకు గ్రామంలోని వరిగడ్డి మోపులు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం పశువులకు మేత కరువైంది.
– బాలెబోయిన వెంకన్న, తొగర్రాయి, కోదాడ మండలం
హుజూర్‌నగర్‌ను ముంచిన వరద
హుజూర్నగర్ : ఇటీవల కురిసిన వర్షాలతో హుజూర్నగర్ పట్టణంలోని 1, 7,8 వార్డులు జలమయమయ్యాయి. దద్దనాల చెరువు కాలనీలోని ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. రహదారులు దెబ్బతిన్నాయి. గోవిందపురంలో రెండు ఇండ్లు పూర్తిగా, మరో మూడు ఇండ్లు పాకిక్షంగా దెబ్బతిన్నాయి. వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. హుజూర్నగర్ మండలంలోని బూరుగడ్డ, గోపాలపురం గ్రామాల్లో చెరువులకు గండి పడడంతో పంట పొలాలను ముంచెత్తాయి. రహదారుల దెబ్బ తినడంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిపోయాయి. చెరవుకట్టకు గండి పడటంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే చెరువులో నుంచి నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 5,680 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారుల అంచనా.
ఇల్లు కూలి చెట్టు కిందనే ఉంటున్న
వర్షాలకు నా ఇల్లు కూలిపోయి సామాన్లు పూర్తి దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు ఎవరూ వచ్చి చూసింది లేదు. అధికారులు వచ్చి విచారణ చేయలేదు. మూడు రోజుల నుంచి చెట్టు కిందనే ఉంటున్న. నిరుపేద అయిన నన్ను ప్రభుత్వం ఆదుకోవాలి.
-కంకణాల అలివేలమ్మ ,గోవిందపురం, హుజూర్నగర్ మండలం
నల్లగొండ జిల్లాలో 1853 ఎకరాల్లో పంట నష్టం
786 ఎకరాల్లో వరి, 1067 ఎకరాల్లో పత్తి
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్4(నమస్తే తెలంగాణ) : ఇటీవల నల్లగొండ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో భారీగానే పంటలకు నష్టం వాటిల్లింది. శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలతో వరదలు వచ్చి పంటలు నీట మునగడం, కొట్టుకోవడం ఎక్కువగా జరిగింది. దీంతో అధికారులు జిల్లా వ్యాప్తంగా పంట నష్టంపై అంచనాలు రూపొందిస్తున్నారు. ఓ రైతు వేసిన పంటలో 33శాతం పైగా దెబ్బతింటేనే దాన్ని నష్టంగా ప్రభుత్వం పరిగణిస్తుంటుంది.
ఈ లెక్కల ప్రకారమే జిల్లా వ్యవసాయ శాఖ బుధవారం వరకు వేసిన నష్టం అంచనాలను వెల్లడించింది. మొత్తం 1,853 ఎకరాల్లో 795 మంది రైతులకు సంబంధించిన వివిధ పంటలు దెబ్బతిన్నట్లుగా క్షేత్రస్థాయిలోని వ్యవసాయ అధికారులు లెక్కలు వేశారు. ఇందులో 514 మంది రైతులకు చెందిన వరి పంట 786 ఎకరాల్లో దెబ్బతినగా, 278 మందికి సంబంధించిన 1,067 ఎకరాల్లో పత్తి పంట, ముగ్గురు రైతులకు చెందిన మూడెకరాల మిర్చి పంటకు నష్టం వాటిల్లింది.
దామచర్ల, మాడ్గులపల్లి, వేములపల్లి, గుర్రంపోడు, పెద్దవూర, చందంపేట, శాలిగౌరారం, కేతేపల్లి, చండూరు, డిండి, నకిరేకల్ మండలాల పరిధిలోని 36 గ్రామాల్లో ఈ పంటనష్టం జరినట్లుగా అంచనాలు రూపొందించారు. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం మేరకు వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఒక్క నల్లగొండ జిల్లా పరిధిలోనే సుమారు ఆరు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. అధికారులు పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమగ్ర నష్టం వివరాలు వెల్లడికానున్నాయి. కాగా వ్యవసాయ శాఖ అధికారులంతా రుణమాఫీ కానీ రైతుల వివరాలు సేకరించే పనిలో బిజీబిజీగా ఉన్నారు.
ఓ వైపు ప్రభుత్వ టార్గెట్ ప్రకారం రుణమాఫీ డ్యూటీ చేస్తూ మరోవైపు పంటనష్టం వివరాలు పూర్తి స్థాయిలో సేకరించడం ఏ మేరకు సాధ్యమన్న సందేహాలు నెలకొన్నాయి. ఇక దీనికి తోడు నిబంధనల ప్రకారం వేసిన పంటలో 33శాతం పైగా దెబ్బతింటేనే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. దీని వల్ల అంతకంటే తక్కువ స్థాయిలో దెబ్బతిన్న పంట రైతులు నష్టపోతున్నారు. వీరికి త్వరలో ప్రభుత్వం ఏదైనా సాయం అందిస్తే దానికి అనర్హులు కానున్నారు. జిల్లావ్యాప్తంగా పంట నష్టం వివరాల సేకరణ కొనసాగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్‌కుమార్ తెలిపారు. ఈ వివరాలన్నింటినీ త్వరలోనే ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వెల్లడించారు.
మాచనపల్లిలో మునిగిన పొలాలు
నూతనకల్ : మండల పరిధిలోని మాచనపల్లి గ్రామంలో వరదకు పొలాలు నీట మునిగాయి. పాలేరు వాగు నుంచి వచ్చే వరద, చిన్ననెమిల చెరువు నుంచి వచ్చే అలుగుతోపాటు కొత్త కుంట చెరువు కట్ట తెగడంతో పక్కన్నే ఉన్న సుమారు 12 మంది రైతుల 12 ఎకరాల్లో వరి నీట మునిగింది. పంట పొలాలు ఇసుక మేటలతో నిండిపోయాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.