నల్లగొండ విద్యా విభాగం( రామగిరి), మే 01 : యోగా సాధనతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ప్రముఖ యోగా గురువు మాదగోని శంకరయ్య అన్నారు. నల్లగొండలోని చర్లపల్లిలో గల డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఎంఈడీ విద్యార్థులకు గురువారం ”యోగా అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్” అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ఎగ్జామినర్ కం శిక్షకులుగా ఆయన హాజరై మాట్లాడారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి యోగా సాధన ఎంతో ముఖ్యమన్నారు. దానిని తెలియజేయాలనే ఉద్దేశంతోనే విద్యా శిక్షణ కళాశాలలో యోగా సబ్జెక్టు ను దేశవ్యాప్తంగా ఎన్సీఆర్టీ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. దీనిలో భాగంగా తొలుత విద్యార్థులకు యోగ విశిష్టతతో పాటు యోగాసనాల ప్రాముఖ్యతను సంపూర్ణంగా వివరించినట్లు చెప్పారు. అనంతరం పలు యోగాసనాలు వేసి చూపించి వాటిని సాధన తీరును వివరించారు.
ఏ ఆసనాలను ప్రాక్టీస్ చేయడం వల్ల శరీరంలోని భాగాలు చైతన్యవంతం అవుతాయో వాటి ప్రాముఖ్యత, ఆహార నియమాలను వివరించారు. ఎంఈడీ, బీఈడీ, డీఈడీ కోర్సుల్లో ఛాత్రోపాధ్యాయులకు యోగ సబ్జెక్టును అందుబాటులోకి తేవడంతో పాటు ప్రాక్టికల్ పరీక్షలను సైతం నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులచే యోగాసనాలు వేయించారు. ముగింపు కార్యక్రమంలో శంకరయ్యను నిర్వాహకులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీవీఎం విద్యా శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.గంగాధర్ రావు, వైస్ ప్రిన్సిపాల్ బొడ్డుపల్లి రామకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.కన్నయ్య, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ బోళ్ల నారాయణరెడ్డి, సీనియర్ అధ్యాపకులు ఆర్.సత్యనారాయణ, డీవీఎం విద్యాసంస్థల సూపరింటెండెంట్ చోలేటి శ్రీధర్ ఆచారి, కళాశాల ప్రోగ్రామర్ పి.శ్రీధర్ రెడ్డి , మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యార్థులు పాల్గొన్నారు.
Nalgonda : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : ప్రముఖ యోగా గురువు శంకరయ్య