రామగిరి (నల్లగొండ), ఏప్రిల్ 02 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని, విద్యార్థుల మీద, యూనియన్ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున, జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ సలీం అన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర ప్లకార్డులు, నల్లరిబ్బులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలను విరమించాలన్నారు. విశ్వవిద్యాలయాలను, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలసిన దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
వర్సిటీలో మరోసారి ఆందోళన చేయబోమని అంగీకరిస్తూ విద్యార్థులు వీడియో వాంగ్మూలం ఇవ్వాలని చెప్పడం అభ్యంతరకరం, అప్రజాస్వామికం అన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ సీపీఎం మంగళవారం యూనివర్సిటీ గేటు దగ్గర ధర్నాకు పిలుపు ఇవ్వగా సీపీఎం నాయకుల ఇండ్ల మీదికి అర్ధరాత్రి వచ్చి అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రజా పోరాటాలను గౌరవిస్తామని ప్రజాస్వామ్య పునరుద్ధరణ తన ఏడవ గ్యారెంటీగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చిన్నపాక లక్ష్మీనారాయణ, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి, కొండ అనురాధ, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, పట్టణ, మండల కమిటీ సభ్యులు కోట్ల అశోక్ రెడ్డి, పోలే సత్యనారాయణ, గాదె నరసింహ, బొల్లు రవీందర్, ఊట్కూరి మధుసూదన్ రెడ్డి, భూతం అరుణ, సలివొజు సైదాచారి, కందుల అశోక్, మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్, కడతాల భూపాల్, బాణాల పరిపూర్ణ చారి, ఆంజనేయులు, పల్లె నగేశ్, కునుకుంట్ల ఉమారాణి, ఆవుల గిరి, శివ, జనార్ధన్, సర్వయ్య పాల్గొన్నారు.