మోతె, ఏప్రిల్ 2 : హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ భూముల వేలాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, అలాగే భూముల పరిరక్షణకు ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులు, సీపీఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు అన్నారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం మోతే మండల కేంద్రంలో ఖమ్మం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేయకుండా తక్షణమే ఆ భూములను వర్సిటీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. భూమిలోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశిస్తే పర్యావరణం దెబ్బతింటుందని, జీవ వైవిద్యం నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులు, ప్రజల న్యాయమైన డిమాండ్‌ను ఆలోచన చేయకుండా ప్రశ్నించిన విద్యార్థులను, రాజకీయ పార్టీలను నిరంకుశంతో అణిచివేయడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమ అరెస్టు చేసిన సీపీఎం నాయకత్వానికి విడుదల చేసి, విద్యార్థులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను కలుపుకుని దీర్ఘకాల ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు గుంటగాని యేసు, సోమగాని మల్లయ్య, బానోతుల చిన్ననాయక్, బానోతు వెంకన్న నాయక్, చెరుకు శీను, ఒగ్గు సైదులు, కోడి లింగయ్య, బానోతు పాప, పోల్లోజు ఉపేందర్, బానోతు హేముల నాయక్, వల్లజు లింగరాజు, బానోతు రమేశ్, వెంకన్న పాల్గొన్నారు.