మిర్యాలగూడ టౌన్, మార్చి 19 : బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం హర్షనీయమని బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహంలో మిఠాయిలు పంచి మాట్లాడారు. ఈ చట్టం బీసీల మొదటి పోరాట విజయమన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ చట్టం చేసినందుకు ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు, మద్దతు తెలిపిన బీఆర్ఎస్, బీజెపీ, ఎంఐఎం, సిపిఐ పార్టీల నేతలకు సమస్త బీసీ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బిల్లు ఆమోదం తదుపరి అమలు కోసం ఢిల్లీ కేంద్రంగా జరిగే పోరాటంపై అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం పట్టణ కార్యదర్శి దోనేటి శేఖర్, నక్కా నాగరాజు, శంకర్, చందు, రవి, సిద్దు, గోపి, కిశోర్, శివ, మున్నా, మహేందర్, నవీన్, వెంకటేశ్, దిలీప్, సాయి పాల్గొన్నారు.