యాదాద్రి భువనగిరి, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో నేతన్నలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. నేత కార్మికులపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పదేండ్లపాటు సమర్థంగా అమలైన పథకాలు ఒక్కొక్కటికిగా కుంటుపడుతున్నాయి. ఇప్పటికే చేనేత మిత్ర పథకాన్ని అటకెక్కించగా.. తాజాగా చేనేతకు చేయూత స్కీమ్‌ను పెండింగ్‌లో పెట్టింది. అధికారంలోకి వచ్చాక ఒక్క పైసా విడుదల చేయలేదు. మరో మూడు నెలల్లో టెర్మ్ పూర్తి కానుండగా సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైన నేతన్నల బతుకుల్లో స్వరాష్ట్రంలో వెలుగులు నిండాయి. నేతన్నలను బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటూ అండగా నిలిచింది. ఉపాధి లేక వలసలు వెళ్లిన కార్మికులకు చేయూతనిచ్చింది. ప్రత్యేకంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ధీమా కల్పించింది. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా పథకం తదితర పథకాలను అమలు చేసి.. నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చింది. గతంలో తట్టాబుట్టా చేతబట్టుకుని వలసల బాట పట్టగా.. కేసీఆర్ పాలనలో అదే కార్మికులు సొంతూర్లలో చేతినిండా పనిదొరకడంతో సంతోషంగా బతికారు.
నేతన్నలకు సామాజిక భద్రత కల్పించడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత చేయూత పథకాన్ని తీసుకొచ్చింది. నేత కార్మికుల నెలసరి చేనేత ఆదాయంలో ఎనిమిది శాతం ఆర్డి1లో జమచేసిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డి2లో 15శాతాన్ని నేరుగా జమ చేయాలి. ఆ మొత్తం నగదు వడ్డీతోపాటు మూడేండ్ల తర్వాత కార్మికులకు అందుతుంది. ఈ పథకం కింద జిల్లాలో 2017-20 సంవత్సరంలో 5,312 మంది నేతన్నలకు రూ. 37.26 కోట్లను ప్రభుత్వం తమ వాటాగా విడుదల చేసింది. ప్రస్తుత 2021-2024 సంవత్సరానికి గాను 11వేల మంది కార్మికులు నమోదు చేసుకున్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డబ్బులు జమ చేయడం మరిచిపోయింది. సెప్టెంబర్ నుంచి డబ్బులు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో ప్రతి నెలా 2.25 కోట్లు చెల్లించాలి. ఎనిమిది నెలలుగా పెండింగ్ పడటంతో రూ.18 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోతున్నాయి. మరోవైపు కార్మికులు మాత్రం తమ వాటాను ఠంఛనుగా కడుతున్నారు. అయితే సెప్టెంబర్‌లో స్కీం టర్మ్ ముగియనుంది. అప్పుడు ఒక్కో కార్మికుడికి రూ.లక్ష వరకు డబ్బులు జమ కానున్నాయి. బకాయిలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నేత కార్మికుల కోసం సబ్సిడీ చేనేత మిత్ర పథకాన్ని అమలు చేసింది. దీని కింద నేత కార్మికులకు రసాయనాలు, నూలుపై 40శాతం రాయితీ కల్పించింది. కొందరికి అవగాహన లేకపోవడం, సబ్సిడీ పొందే ప్రక్రియ తెలియకపోవడంతో దానిని పొందలేకపోయారు. దీని స్థానంలో మగ్గం మీద పనిచేసే ప్రతి కార్మికుడికి నెలనెలా రూ. 3వేల ఆర్థిక సాయం చేయాలని భావించింది. నేత కార్మికుల బ్యాంక్ ఖాతాలో రూ. 3వేలను జమ చేసింది. ఇందులో నేత కార్మికుడికి రూ.2వేలు, అనుబంధ కార్మికులకు వెయ్యి ఖాతాల్లో వేసింది. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పథకాన్ని బంద్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
చేనేత చేయూత పథకం కింద ప్రతినెలా 2వేల రూపాయలు బ్యాంకులో జమ చేస్తున్నాం. ఒక పోచంపల్లిలోనే 2,500 మంది ప్రతినెలా త్రిఫ్ట్ డబ్బులు కడుతున్నారు. గత 8 నెలల నుంచి ప్రభుత్వ వాటా చెల్లించడం లేదు. డబ్బులు మీరు కట్టుకుంటూ వెళ్లండి.. ప్రభుత్వం డబ్బులు అవే వస్తాయి అని అధికారులు చెబుతున్నారు. 36 నెలల తర్వాత త్రిఫ్ట్ డబ్బులు మా చేతికి వస్తాయి. ఈ సారి సరైన సమయానికి ఇస్తారో లేదో చూడాలి. ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవాలి. వస్త్రాలను కొనుగోలు చేయాలి. కార్మికులందరికీ పని కల్పించాలని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించాలి.
– కర్నాటి పురుషోత్తం, చేనేత కార్మికుడు భూదాన్‌పోచంపల్లి
మా కుటుంబ జీవనాధారమే చేనేత పరిశ్రమ. మగ్గం నేస్తేనే వచ్చే ఆదాయంలో కొంత బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. కరోనా సమయంలో త్రిఫ్ట్ పథకం మా కుటుంబానికి ఎంతో ఆసరా అయినది. ప్రభుత్వం ప్రతినెలా త్రిఫ్ట్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయాలి. చేనేత పరిశ్రమ సంక్షోభంతో గిరాకీ లేక చేసేందుకు పని లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు అవసరం వచ్చినప్పుడు త్రిఫ్ట్ పథకంలోని డబ్బులు తీసుకునే వెసులుబాటును కల్పించాలి.
– బోడ దయానంద్, చేనేత కార్మికుడు, భూదాన్‌పోచంపల్లి
గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన చేనేత త్రిఫ్ట్ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించి న్యాయం చేయాలి. గత సంవత్సరం సెప్టెంబర్ వరకు ఈ పథకం కొనసాగింది. 36 నెలలు పాటు కొనసాగే ఈ పథకం ఇప్పటికీ 25 నెలలు కావస్తుంది. కార్మికులం కష్టపడి కిస్తీలు చెల్లించాం ఇప్పుడు మధ్యలో ఆగిపోతే నష్టపోతాం. మాకు చాలా వరకు చేయూతనిస్తున్న ఈ పథకాన్ని నిలిచిపోకుండా చూడాలి. మా చేనేత కార్మికుల సంక్షేమం గురించి ప్రభుత్వం చేనేత సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగించాలి.
– గుర్రం నర్సింహ, చేనేత కార్మికుడు, చౌటుప్పల్ పట్టణం
చేనేత కార్మికులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత పొదుపు పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో ఒకవంతు చేనేత కార్మికుడు డబ్బులను జమ చేస్తే రెండు వంతులు ప్రభుత్వం జమ చేస్తుంది. కానీ 8నెలల నుంచి ప్రభుత్వం డబ్బులు జమ చేయడం లేదు. దాంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే పొదుపు పథకం డబ్బులను నేతన్నల ఖాతాల్లో జమ చేయాలి.
– పున్న వెంకటేశం, చేనేత కార్మికుడు, సిరిపురం, రామన్నపేట మండలం