యాదగిరిగుట్ట, మార్చి4 : యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం తెల్లవారు జామున ప్రధానాలయంలో ద్వారతోరణ పూజ, ధ్వజ కుంభా రాధన, అగ్ని ఆరాధన, మూల మంత్ర, పంచసూక్త హవనం పూజలు నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో భాగంగా లక్ష్మీనరసింహ స్వామిని వంట పత్రశాయి అలంకారంలో ప్రత్యేక పల్లకిపై అధిష్ఠించారు.
రుత్వికులు, వేదపండితులు స్వామివారి అలంకార సేవ ముందు దివ్య ప్రబంధ వేద పారాయణాలు, మూల మంత్రజప పఠనాలు చేశారు. అనంతరం సన్నాయి మేళంతో స్వామివారిని ప్రధానాలయ తిరుమాఢవీధుల్లో ఊరేగించారు. అనంతరం తూర్పు మాఢవీధుల్లో ప్రత్యేక వేంచేపు మండపంలో ఆస్థానం చేసి ప్రధానార్చకులు వటపత్రశాయి విశిష్టతను భక్తులకు వినిపించారు. సాయంత్రం లక్ష్మీనరసింహ స్వామిని హంస వాహనంపై అధిష్ఠింపజేసి తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు.
కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, కార్య నిర్వహణాధికారి భాస్కర్రావు, డీఈఓ దోర్బల భాస్కర్ శర్మ, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు, యాజ్ఞాచార్యులు కిరణ్కుమారాచార్యులు, ముఖ్య అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, ఉప ప్రధానార్చకులు, పారాయణికులు, రుత్వికులు, సహాయ కార్యనిర్వహణాధికారులు, పాల్గొన్నారు. గురువారం లక్ష్మీనరసింహ స్వామి శ్రీకృష్ణాలంకరణ సేవలో(మురళీకృష్ణుడు) భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం పొన్నవాహన సేవలో ఊరేగనున్నారు.