రామగిరి, జూన్ 27 : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక బహిరంగ లేఖను సీఐటీయూ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.డి.సలీం స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ప్రభుత్వ రంగంలో నిర్మించబడిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రాష్ట్ర విద్యుత్ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతోందన్నారు. ఇలాంటి వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు ప్రజల్లో, కార్మికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
– ప్రజల పన్నుల ధనంతో నిర్మించబడిన యాదాద్రి ప్లాంట్ ప్రధాన లక్ష్యం ప్రజలకు చౌకగా, నాణ్యమైన విద్యుత్ అందించడమే. ప్రైవేటీకరణ వల్ల ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం పెరిగి, ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుంది
– ప్లాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి
– ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, సామాజిక న్యాయానికి ఎంతో అవసరం
– యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన అన్ని చర్యలను వెంటనే నిలిపివేయాలి
– ప్లాంట్ను పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి
– స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించడంతో పాటు, కార్మికుల ఉద్యోగ భద్రత, హక్కులను పరిరక్షించాలి
– తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, యాదాద్రి పవర్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని వారు కోరారు.