రామగిరి ఆగస్టు 31 : ప్రకృతితో మమేకమై జీవన తాత్వికతను తన కవిత్వంలో నేర్పుగా ఆవిష్కరించగల కవి మునాసు వెంకట అని ప్రజా కవి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. సృజన సాహితీ ఆధ్వర్యంలో ఆదివారం గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో నల్లగొండకు చెందిన ప్రముఖ కవి మునాస వెంకట్ కవిత్వం దాపు పుస్తకాన్ని దావిజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని గోరటి వెంకన్న మాట్లాడారు. అస్తిత్వ ఉద్యమాలలో దళిత బహుజన కవిత్వాన్ని సుసంపన్నం చేసిన కవుల్లో మునాస వెంకట్ ముందు వరుసలో ఉంటారన్నారు. ప్రముఖ విమర్శకులు అంబటి సురేంద్ర రాజు మాట్లాడుతూ..అట్టడుగు వర్గ జీవితాలతో అంతర్జాతీయ స్థాయి కవిత్వం రాసిన వారు మునాసు వెంకట్ అని కొనియాడారు.
మరొక విమర్శకులు గుంటూరు లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ నవ్యమైన అభివ్యక్తితో తనదైన శైలిలో కవిత్వం రాసిన వెంకట్ కవిత్వం తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం అజరామరం అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ బెల్లి యాదయ్య ,కవి గాయక సిద్ధార్థ, బైరెడ్డి కృష్ణారెడ్డి, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య భాను, కొత్వాల్, పెరుమాళ్ల ఆనంద్, అంబటి వెంకన్న, తుల శ్రీనివాస్, మేరెడ్డి యాదగిరి రెడ్డి, శీలం భద్రయ్య, బోధనం నర్సిరెడ్డి, పగడాల నాగేందర్, భూతం ముత్యాలు, సాగర్ల సత్తయ్య, కస్తూరి ప్రభాకర్ మాదగాని శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.