మరోసారి ఎన్నికైన గుత్తా
ఆదివారం నామినేషన్ దాఖలు.. ఏకగ్రీవంగా ఎన్నిక
నేడు ఉదయం 11గంటలకు బాధ్యతల స్వీకరణ
జిల్లాను మరోసారి వరించిన అత్యున్నత పదవి
సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు : గుత్తా
నల్లగొండ ప్రతినిధి, మార్చి 13(నమస్తే తెలంగాణ) : చట్ట సభల్లో అత్యున్నతమైనదిగా భావించే శాసనమండలి చైర్మన్ పదవి సీనియర్ నేత, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని మరోసారి వరించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మండలి చైర్మన్‌గా గుత్తాకు వరుసగా రెండోసారి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఆదివారం గుత్తా సుఖేందర్‌రెడ్డి చైర్మన్ పదవి కోసం తన నామినేషన్ దాఖలు చేశారు. ఒకటే నామినేషన్ దాఖలు కావడంతో చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. సోమవారం ఉదయం 11గంటలకు శాసనమండలి చైర్మన్‌గా సుఖేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. శాసన మండలి చైర్మన్‌గా గుత్తా ఎన్నికతో జిల్లాకు మరోసారి అత్యున్నత పదవి దక్కినైట్లెంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి గత నవంబర్ 22న ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. గుత్తా ఎన్నిక పట్ల మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.
ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వరుసగా రెండోసారి శాసనమండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నల్లగొండ ఎంపీగా టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామి కావాలన్న కోరికతో 2016లో సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి పార్టీ అధినేత కేసీఆర్, యువ నేత కేటీఆర్ మార్గదర్శనంలో పనిచేస్తున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించడంతో 2019 ఆగస్టు 26న తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. చట్టసభల్లో ఉన్న సీనియారిటీ నేపథ్యంలో అదే ఏడాది మండలి చైర్మన్‌గా సుఖేందర్‌రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ఎంపిక చేశారు. దాంతో 2019 నవంబర్ 11న శాసనమండలి చైర్మన్‌గా తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి గతేడాది జూలై 4 నాటికి ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియడంతో తిరిగి ఎన్నిక అనివార్యమైంది. సుమారు 20నెలల వరకు మండలి చైర్మన్ పదవిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి కొనసాగారు. నిబంధనల ప్రకారం ఆ వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సిఉన్నా రెండోదశ కరోనా తీవ్రత వల్ల కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికను వాయిదా వేసింది. కరోనా పరిస్థితులు కొంత కుదుటపడ్డాక గత నవంబర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించారు. ఎమ్మెల్యేల కోటా అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్ గుత్తాకు అవకాశం కల్పించడంతో నవంబర్ 22న ఏకగ్రీవంగా రెండోసారి ఎన్నికయ్యారు.
గుత్తా పదవీకాలం ముగిసిన తర్వాత ఇప్పటి వరకు చైర్మన్ ఎన్నిక జరుగలేదు. ఈ మధ్య కాలంలో సీనియర్ సభ్యులైన ఇద్దరు ప్రొటెం చైర్మన్లుగా వ్యవహరించారు. తాజాగా శుక్రవారం గవర్నర్ ఆదేశాలతో మండలి చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. దాంతో మరోసారి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్రెడ్డినే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎంపిక చేయడంతో ఆదివారం పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల సమక్షంలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. గడువు ముగిసే సరికి ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో గుత్తా సుఖేందర్‌రెడ్డి మరోసారి మండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఉదయం11గంటలకు శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీ సహా ఇతర ప్రముఖులంతా హాజరుకానున్నట్లు తెలిసింది. నామినేషన్ కార్యక్రమంలో జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో పాటు ఇతర మంత్రులు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పాశం రాంరెడ్డి, గుత్తా కుమారుడు అమిత్‌కుమార్‌రెడ్డి, ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చైర్మన్‌గా ఎన్నిక ఏకగ్రీవం కావడంతో గుత్తా సుఖేందర్‌రెడ్డిని శాసనసభ సచివాలయం ఆవరణలోనే మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రత్యేకంగా అభినందించారు.
సీఎం కేసీఆర్, యువనేత కేటీఆర్‌కు కృతజ్ఞతలు : గుత్తా
తనపై నమ్మకం ఉంచి మరోసారి అత్యున్నత చైర్మన్ పదవికి ఎంపిక చేసిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువనేత కేటీఆర్‌కు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పజెప్పిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. మండలి గౌరవం పెరిగేలా సభ్యులందరి సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు.
వార్డు మెంబర్ నుంచి…
గుత్తా సుఖేందర్‌రెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. గ్రామ స్థాయి నుంచి చట్టసభల్లో అత్యున్నత పదవుల వరకు ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. స్వగ్రామం చిట్యాల మండలం ఉరుమడ్లలో 1981లో గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన గుత్తా 1985లో చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, 1992లో సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1992లో మదర్ డెయిరీ చైర్మన్‌గా ఎన్నికై 1995 నుంచి 1999 వరకు ఏపీ డెయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 1995లో దేవరకొండ నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. ఆ వెంటనే 1999లో తొలిసారిగా టీడీపీ నుంచి అప్పటి మిర్యాలగూడ లోక్‌సభ స్థానంలో ఎంపీగా గెలుపొందారు. 2004లో టీడీపీ నుంచి నల్లగొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి 2009లో కాంగ్రెస్‌లో చేరి తిరిగి రెండోసారి ఎంపీగా గెలిచారు. 2014లోనూ మూడోసారి ఎంపీగా గెలిచారు. యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా 1983లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరి 2009 వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ క్రియాశీలక పాత్ర పోషించారు. 2016 జూన్‌లో ఎంపీగా టీఆర్ఎస్లో చేరారు. 2019 ఆగస్టులో ఎమ్మెల్సీగా, ఆ వెంటనే నవంబర్‌లో తొలిసారిగా మండలి చైర్మన్‌గా ఎన్నికై గతేడాది జూలై 4వ తేదీ వరకు కొనసాగారు. తిరిగి రెండోసారి ఎమ్మెల్సీగా గతేడాది నవంబర్ 22న ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా మండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.