రామగిరి, అక్టోబర్ 06 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల ఔట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల ఆరు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో 14 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు ఉన్నాయని, వాటిలో వాచ్మెన్, అటెండర్, ఎలక్ట్రిషన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఐసిటి కేటగిరీలలో స్కూల్‌కు ఐదుగురు చొప్పున 70 మంది విధులు నిర్వహిస్తున్నారని, వీరికి గత ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదన్నారు.
ఇచ్చేదే కొద్దిపాటి వేతనం, అది కూడా ఆరు నెలలుగా రాకపోవడంతో అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి వచ్చిందని దసరా పండుగకు కూడా మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్టర్ ప్రభుత్వం తమకు డబ్బులు ఇవ్వలేదని అందుకనే తాము జీతాలు ఇవ్వడం లేదని చెబుతున్నారన్నారు. ఎన్నికల ముందు అనేక వరాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు కూడా సకాలంలో ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా పెండింగ్ వేతనాలు ఇవ్వకపోతే నిరవదిక సమ్మె తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పెరుమాళ్ల సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ గురుకులాల ఉద్యోగులు పాల్గొన్నారు.
Ramagiri : ‘సోషల్ వెల్ఫేర్ గురుకులాల ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి’