కట్టంగూర్, ఆగస్టు 12 : కాంగ్రెస్ ప్రభుత్వంలో, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. వంటశాల, మరుగుదొడ్లు. భోజనం, బియ్యం, పరిసరాలను పరిశీలించి విద్యార్థినులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడం, సన్న బియ్యం కాకుండా దొడ్డు బియ్యంతో అన్నం పెడుతున్నారని, మెత్తగా ఉండడంతో తినలేకపోతున్నామని విద్యార్థినులు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. పాఠశాలలో తాగునీరు. మరుగుదొడ్లు, గదులకు కిటికీలు, తలుపులు ఇతర ప్రాథమిక సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం సరఫరా చేయడంతో అన్నంలో నీళ్లతో పాటు మెత్తగా ఉండడంతో విద్యార్థులు తినలేక అర్థాకలితో పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కాంగ్రెస్ పార్టీకి దాసోహం అయి విద్యార్థుల సమస్యల గాలికి వదిలేసినట్లు తెలిపారు. పలు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, పాము కాటు, ఎలుకల దాడి, విద్యుత్ షాక్ వంటి సంఘటనలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యా శాఖ మంత్రి అయిన సీఎం ఆ పదవిలో కొనసాగే హక్కు లేదని, బాధ్యత వహించి విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలన్నారు.
Kattangur : సీఎం రేవంత్ పాలనలో గురుకులాలు నిర్వీర్యం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కేసీఆర్ పాలనలో వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని, అందులో చదువుకున్న విద్యార్థులు నేడు ఐఏఎస్, ఐపీఎస్ లుగా ఎంపికైనట్లు తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన హైక్లాస్ విద్యా వ్యవస్థ వల్ల ఎంతో మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటూ లబ్ధి పొందుతున్నట్లు చెపపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత నాణ్యతా ప్రమాణాలతో విద్యార్థులకు మెనూ లభించేదన్నారు. గురుకుల విద్యార్థుల ఆరోగ్యం, వారి భవిష్యత్ తో ఆటలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజలు దగ్గరపడ్డాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, మాజీ సర్పంచ్ దాసరి సంజయ్ కుమార్, నాయకులు పెద్ది బాలనర్సయ్య, రెడ్డిపల్లి మనోహర్, పోగుల అంజయ్య, మంగదుడ్ల వెంకన్న, పోతరాజు నగేశ్, అంతటి శ్రీను, పెద్ది మల్లేశ్ పాల్గొన్నారు.
Kattangur : సీఎం రేవంత్ పాలనలో గురుకులాలు నిర్వీర్యం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య