నకిరేకల్, ఫిబ్రవరి 20 : తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో గురుకుల పాఠశాలల పని వేళలు సవరించాలని, రాత్రి విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు మరుసటి రోజు ఉదయం 9 గంటలకు హాజరు కావడానికి అనుమతి ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పేరుమాళ్ల వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు చేపట్టాలని, పార్ట్ టైం టీచర్ల వేతనాలు చెల్లించాలని, రెగ్యులర్ ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో (010) పద్దు కింద వేతనాలు అమలు చేయాలన్నారు. శుక్రవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల- నకిరేకల్‌లో నిర్వహించిన తెలుగు అధ్యాపకుడు కందుకూరి యాదయ్య ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గత మూడు దశాబ్దాలుగా యాదయ్య ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారన్నారు. వృత్తి పట్ల అంకితభావం, నిజాయితీ, కష్టపడే తత్వంతో విద్యార్థుల ఉన్నత శిఖరాలకై కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సమస్యలను ప్రస్తావించారు. అనంతరం నకిరేకల్ మండల శాఖ ఆధ్వర్యంలో అభినందించి కుటుంబ సంక్షేమ నిధి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు టి.నర్సింహమూర్తి, మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాస్, ఈ.హరికృష్ణ, నాయకులు బి.వేణుగోపాల్, శ్యామ్, అరుణ పాల్గొన్నారు.