సూర్యాపేట, మే 6 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడదిన్నర అవుతున్నా ఇంకా కేసీఆర్ పెట్టిన రూ.లక్ష చెక్కులే ఇస్తున్నారని, రూ.లక్షతో పాటు తులం బంగారం ఎప్పుడిస్తారో అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రభుత్వాని ప్రశ్నించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన 306 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఇవ్వడం లేదన్నారు. దీని కోసం ఆడబిడ్డల తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్న ఏ ఒక్క పథకం సక్రమంగా అమలు కావడం లేదన్నారు. ఆడబిడ్డ ఇంటికి బరువు కాదు వరం అని నాడు కేసీఆర్ వారి పేరు మీద ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆడబిడ్డ పెండ్లికి ప్రభుత్వం సహాయం చేయడం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేశారని చెప్పారు. తొలుత రూ. 50 వేలు, ఆ తర్వాత రూ. 1,00,116 పెంచారని గుర్తు చేశారు. ఇక తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం కేసీఆర్ కిట్టు ఇచ్చామని, కానీ ఆ పథకం అలానే కొనసాగిస్తే బాగుండేదని తెలిపారు. తమ ప్రభుత్వంలో బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి కాటికి పోయే వరకు వివిధ వర్గాలకు ఏదో ఒక సంక్షేమ పథకం అందేలా చేశామని, కానీ ఇప్పుడు అన్నీ పోయి కొన్ని మాత్రమే ఇస్తున్నారని ప్రజలు వాపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ర్టాన్ని ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పెద్దలా పాలించారని, ఇప్పుడు ప్రజలు కేసీఆర్ పాలన గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలన్నీ పూర్తి అమలు చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట మండలం, మున్సిపాలిటీ పరిధి, పెన్‌పహాడ్, చివ్వెంల , ఆత్మకూర్(ఎస్) మండలాల చెందిన 306 మందికి రూ. 1,00,116 చొప్పున రూ. 3,06,35,496 చెక్కులను ఈ సందర్భంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ఆర్డీఓ వేణుమాధవరావు, తాసీల్దార్లు శ్యాంసుందర్‌రెడ్డి, లాలు, హరికిశోర్ శర్మ, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.