సూర్యాపేట రూరల్, డిసెంబర్ 9: పదేండ్లలో దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తెలంగాణ తొలి సీఎం కేసీఆరేనని, కేసీఆర్ అంటేనే అభివృద్ధి అని, రేవంత్ అంటే దందాలు, కమీషన్లు అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాళ్లకాంపాడ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. పదేండ్లలో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉండెనని, ఇప్పటి రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నో అరాచకాలు చూస్తున్నామన్నారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను దూరం చేసుకొని బాధపడుతున్నారన్నారు. మంత్రులంతా కమీషన్లు, కబ్జాల వేటలో పడ్డారని అన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప కాంగ్రెస్ కొత్తగా చేసిందేమీ లేదన్నారు. ఆ పార్టీ సర్పంచ్‌లను గెలిపిస్తే ఏం అభివృద్ధి చేస్తారన్నారు. మళ్లీ అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ పార్టీయేనని, బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్, వార్డు మెంబర్లను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, భిక్షం, సంతోష్‌రెడ్డి, అభ్యర్థి వీరాంజనేయులు పాల్గొన్నారు.