సూర్యాపేట, నవంబర్ 28: సూర్యాపేట జిల్లాలో సారా మహ్మమారి మళ్లీ కోరలు చాస్తున్నది. అమాయకుల ప్రాణాలను బలితీసుకుని, అనేక కుటుంబాలను రోడ్డున పడేసిన సారాపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. తయారీ, విక్రయాలను కట్టుదిట్టంగా ఆపేసింది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సారా నియంత్రణను గాలికి వదిలేసింది. దాంతో తండా లు, గ్రామాల్లో నాటుసారా విచ్చలవిడిగా తయారవుతున్నది. ఎక్కుడ పడితే అక్కడ సారా తయారు చేస్తుండంతో నెలకు వంద కేసుల చొప్పున నమోదు అవుతున్నాయి. ఇంకా బయటకు రాని తయారీ స్థావరాలు వేలల్లో ఉంటున్నాయి. అందులో వెలుగు చూస్తున్న కేసులు కొన్ని మాత్రమే. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 1030పైగా కేసులు నమోదవగా, 800మందిపై కేసులు పెట్టారు.
జిల్లాలో సారా తయారీ విపరీతం అవుతున్నది. తండాలు, గ్రామాలే కాకుండా పట్టణాల్లోనూ సారా తయారు చేసి విక్రయిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సారీ తయారీపై నియంత్రణ లేకపోవడంతో పరిస్థితి చేయి దాటిపోతున్నది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గడిచిన పది నెలల్లో ఎక్సైజ్ శాఖ 1,030 కేసులు నమోదు చేసింది. అంటే సగటున నెలకు 90 నుంచి వంద సారా కేసులు నమోదు అవుతున్నాయి. ఇవి కేవలం ఎవరైనా ఇచ్చిన సమాచారంతో తనిఖీలు చేసి పట్టుకుంటున్నవి మాత్రమే. వాస్తవానికి క్షేత్రసాయిలో రహస్య ప్రదేశాలలో పెద్ద ఎత్తున్న సారా తయారు చేస్తూ విక్రయాలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు నమోదైన సారా కేసుల్లో 4,650 లీటర్ల సారా, 1.90 లక్షల లీటర్ల పానకం, 22 వేల కిలోల బెల్లం, 4,500 కిలోల పటిక, 180 వాహనాలు పట్టుకోని సీజ్ చేశారు.
నాడు ఉక్కు పాదంతో అణిచివేత
సారా కారణంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లోని నిరుపేద ప్రజలు అనారోగ్యం బారిన పడి మరణాల సంఖ్య పెరుగుతుండడంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సమస్యను గుర్తించి రాష్ట్రంలో ఎక్కడా సారా తయారీ ఉండొద్దని నిర్ణయించారు. కేసీఆర్ పాలన ఉన్న వరకు జిల్లాలో ఎక్కడా సారా మాట వినిపించ లేదు. ఇతర ప్రాంతాల నుంచి కూడా రవాణా లేదు. సారా తయారీని కుటీర పరిశ్రమగా ఏర్పాటుచేసుకుని జీవించిన వారి ఉపాధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి ప్రత్యామ్నాయ మార్గాలను చూపింది. కిరాణం, పాడి పరిశ్రమ ఇలా వారు ఏది కావాలంటే అది ఏర్పాటు చేసింది. నాడు నల్లబెల్లం ఆనవాళ్లు కూడా కనిపించేవి కాదంటే సారాపై కట్టడి, ప్రజారోగ్యంపై శ్రద్ధ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం సారా తయారీని కట్టడి చేయకపోవడంతో అడ్డూఅదుపు లేకుండా పోయింది. గత వారం రోజుల వ్యవధిలో చివ్వెంల మండల పరిధిలోని లక్ష్మీనాయక్తండా శివారులో జిల్లా ఎక్సైజ్ , ఏసీ ఎన్ఫోర్స్ మెంట్ బృందం తనిఖీలో ఒక్క డీసీఎం వాహనంలోనే 2,750 కేజీల నల్ల బెల్లం, 40 కేజీల పటిక, 10 లీటర్ల సారాను పట్టుకున్నారు.
మళ్లీ సారా చావులు చూడాలా?
సమైక్య పాలనలో తెలంగాణలో సారా చావులు అనేకం. వృద్ధులే గాక నడి వయస్సు వాళ్లు, యువత కూడా సారాకు బానిసై చనిపోవడంతో వారి కుటుంబాలు దీన స్థితికి వెళ్లేవి. ప్రతి గ్రామంలో సుమారు వంద మంది వరకు సారాకు బానిసలుగా మారి చనిపోయిన వారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ సమస్యను గుర్తించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో సారా అనే పదం లేకుండా చేశారు. కానీ మళ్లీ కాంగ్రెస్ ప్ర భుత్వం నిర్లక్ష్యంతోనే సారా ఏరులై పారుతున్నది.
సారా తయారీపై ఫిర్యాదు చేయండి
జిల్లాలో సారా తయారీని ఉపేక్షించేంది లేదు. ఎక్కడైనా నల్లబెల్లం, పటిక కనిపిస్తే బాధ్యతగా వెంటనే సమాచారం అందించాలి. ఎనిమిది నెలలుగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశాం. సరిహద్దు జిల్లాల నుంచి వచ్చే వాహనాలను కూడా పట్టుకుని కేసులు పెట్టాం. సారా తయారీపై ఎలాంటి సమాచారం ఉన్నా 8712658938 నెంబరుకు ఫిర్యాదు చేయొచ్చు.
– ఆర్.లక్ష్మానాయక్, ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్, సూర్యాపేట