కట్టంగూర్, మే 17 : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఏపీఓ కడెం రాంమోహన్ తెలిపారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన సామాజిక చేపల గుంతను శనివారం పరిశీలించి కూలీల మస్టర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యానసాగులో డ్రాగన్ ఫ్రూట్, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, కొబ్బరితో పాటు అన్ని రకాల పండ్ల మొక్కలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ఆసక్తి గల రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కమ్యూనిటీ చేపల గుంతల ద్వారా అన్ని వర్గాల వారికి ఉపాధి లభిస్తుందన్నారు. కొలతల ప్రకారం రూ.307 గిట్టుబాటు అయ్యే విధంగా పనులు చేయాలని కూలీలకు సూచించారు. గ్రామంలో ప్రతి రోజు 135 మంది కూలీలు పనుల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఆయన వెంట ఫీల్డ్ అసిస్టెంట్ దాసరి యాదగిరి, సిబ్బంది ఉన్నారు.