నల్లగొండ ప్రతినిధి, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : అసలు వేసవి ముందున్నా.. ప్రారంభంలోనే భూగర్భ జలాలు అథఃపాతాళానికి చేరుకుంటున్నాయి. కొద్దిరోజులుగా వేగంగా నీటి మట్టం పడిపోతుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. నాగార్జునసాగర్తోపాటు ఏఎమ్మార్పీ ఆయకట్టు వరకు ఇబ్బంది లేకున్నా మిగతా నాన్ ఆయకట్టు ప్రాంతం అంతా సాగునీటి కోసం రైతాంగం అల్లాడుతున్నది. ఫిబ్రవరి ప్రారంభం నుంచే ఎండలు పెరుగుతుండడంతో పంటలకు నీటి అవసరాలు పెరుగడం తదితర కారణాలతో భూగర్భ జలాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. నెల రోజుల్లోనే మీటరు లోతుకు నీటిమట్టం పడిపోయింది. ఫిబ్రవరి చివరి నాటికి నల్లగొండ జిల్లా సగటు భూగర్భ జల నీటిమట్టం 7.74 మీటర్లుగా నమోదైంది. ఇక వేసవి తీవ్రతతో మరింత వేగంగా భూగర్భజలాలు పడిపోనున్నాయి. ఇలా నీటిమట్టం పడిపోతుండడం వల్ల పంటలకు నీరు అందిస్తున్న బోర్లు, బావులు క్రమంగా ఎండిపోతున్నాయి. చేతికి ఎదిగిన పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు వాటిని కాపాడుకునేందుకు కొత్తగా బోర్లు వేస్తున్నారు. దీనివల్ల అదనపు భారంతో పాటు అనుకున్న మేర బోర్లు సక్సెస్ కాకపోవడంతో రెండు విధాలుగా నష్టపోతున్న దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఏడాది నాన్ఆయకట్టులో సరైన వర్షాలు కురువకపోవడంతో ఎక్కడా పెద్దగా చెరువులు, కుంటలు నిండిన దాఖలాలు లేవు. దాంతో భూగర్భ జలాల్లో పెరుగుదల లేదు. సీజన్ ప్రారంభంలో కురిసిన వర్షాలతో అందుబాటులోకి వచ్చిన అరకొర నీటితో వానకాలం పంటలు గట్టెక్కినా ప్రస్తుత యాసంగి పంటలు నీటి కోసం అర్రులు చాస్తున్నాయి. దీని వల్ల ఇప్పటికే వేలాది ఎకరాల్లో వరి చేలతోపాటు అక్కడక్కడా పండ్ల తోటలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయంగా బోర్లు వేస్తున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా భూగర్బ జల వనరుల శాఖ ఫిబ్రవరి నెలలో సేకరించిన వివరాల ప్రకారం.. జిల్లాలో సగటు లోతు 7.74 మీటర్లుగా నమోదైంది. కొన్ని మండలాల్లో మాత్రం 10మీటర్లకు లోతుకు కూడా నీటిమట్టం పడిపోయింది. దామరచర్లలో 15.94 మీటర్లకు పడిపోగా, నాంపల్లిలో 12.88 మీటర్లు, డిండిలో 12.59, చిట్యాలలో 11.59, చింతపల్లిలో 11.32, మర్రిగూడలో 10.98, కట్టగూరులో 10.43, మునుగోడులో 10.47మీటర్లతో అత్యధికంగా లోతుల్లోకి భూగర్భజలాలు పడిపోయాయి.
ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఒక్క నెలలోనే మీటరు లోతుల్లోకి నీటిమట్టం పడిపోయింది. జనవరిలో జిల్లా సగటు 6.82 మీటర్లు కాగా, ఫిబ్రవరి చివరి నాటికి 7.74 మీటర్లకు పడిపోయింది. ఇందులోనూ నాగార్జునసాగర్ ఆయకట్టుతోపాటు ఏఎమ్మార్పీ ఆయకట్టు పరిధిలోని మండలాలు కూడా ఉండడంతో సగటు నీటిమట్టం ఓ మాదిరిగా కనిపిస్తున్నది. డివిజన్ల వారీగా చూస్తే నల్లగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో సగటు నీటిమట్టం 8.59 మీటర్ల లోతున ఉంది. జనవరిలో 7.43 మీటర్లుగా నమోదైంది. అంటే 1.16మీటర్లు పడిపోయాయి. ఇక దేవరకొండ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో పరిశీలిస్తే జనవరిలో సగటున 7.82 మీటర్లుగా ఉంటే ఫిబ్రవరిలో 8.44 మీటర్ల లోతుల్లో ఉన్నాయి. ఇక సాగర్ ఆయకట్టులోని మిర్యాలగూడ డివిజన్లోని 10 మండలాల్లో సగటున 6.23 మీటర్ల లోతుల్లో నీరు లభిస్తుంది. ఇదే డివిజన్లోని దామరచర్ల మండలంలో మాత్రం ఎక్కడా లేనివిధంగా 11.65 మీటర్ల నుంచి ఒకేసారి 15.94 మీటర్లకు నీటిమట్టం పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. మిర్యాలగూడలో 2.07 మీటర్లు, త్రిపురారంలో 2.64 మీటర్లు, వేములపల్లిలో 3.24మీటర్ల లోతుల్లోనే భూగర్భజలాలు అందుబాటులో ఉండడం ఇక్కడ ఉపశమనం. ఇప్పటికి ఇంకా నిండు వేసవి రాక ముందే భూగర్భజలాలు పడిపోతుండగా, ఏప్రిల్, మే నాటికి పరిస్థితి మరింత దిగజారవచ్చు.
భూగర్భ జలాలు పడిపోతున్న నేపథ్యంలో నాన్ఆయకట్టులో వరి పంటకు తీవ్ర నీటిఎద్దడి ఎదురవుతున్నది. దాదాపు ప్రతి రైతుది అరెకరమో… ఎకరమో పంట ఎండిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పంటలు కాపాడుకునేందుకు రైతులు కొత్తగా బోర్లు వేస్తూ భగీరథ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒక్కో రైతు మూడుచ నాలుగు బోర్లు వేస్తున్నారు. ఒక్కో బోరుకు సగటున 40వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఇలా వేస్తున్న బోర్లల్లోనూ పెద్దగా సక్కెస్ రేట్ లేకపోవడం ఆందోళనకు గురిచేస్తుంది. ఓ వైపు పంట ఎండిపోవడం, మరోవైపు కొత్త బోర్లకు పెట్టుబడి అదనపు భారంగా మారుతున్నది. నల్లగొండ చుట్టుపక్కల మండలాల్లో గత నెల రోజుల్లోనే 3వేల వరకు కొత్తగా బోర్లు వేసినట్లు బోర్ వెల్స్ యజమానుల లెక్కలు చెప్తున్నాయి. పంటలు కాపాడుకోవడానికి ఈ నెల కీలకం కావడంతో బోర్వెల్స్ విరామం లేకుండా నడుస్తున్నాయి. ఒక్కో బోర్ యజమానికి రోజు కనీసం ఐదు నుంచి ఆరు బోర్లు వేస్తున్నట్లు సమాచారం. ఏదైనా బోర్ బండి ఒక ఊరికి వెళ్తే అక్కడే రోజులకొద్దీ గిరాకీ ఉంటున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే అరకొర రుణమాఫీ, రైతుభరోసా రాని పరిస్థితులతో రైతులు సతమతం అవుతున్నారు. తాజాగా భూగర్భజలాల దెబ్బ నాన్ఆయకట్టు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.
ఆరెకరాల పొలంలో వరి సాగు చేస్తే ఉన్న బోర్లు ఇంకిపోయి, సాగు నీళ్లు లేక మూడెకరాల పంట పశువులకు మేతయ్యింది. కరెంటు సక్కగ రాక లో ఓల్టేజీతో మోటారు కాలిపోయింది. ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుబంధు ఇయ్యలేదు.. రుణమాఫీ చెయ్యలేదు.. పంట పొలాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితీ లేదు. ఒక్కో ఎకరానికి రూ.7వేల చొప్పున మూడెకరాలు దున్నకాలకు రూ.21 వేలు ఖర్చు చేశా. నాటు వేసేందుకు ఎకరానికి రూ.7 వేల చొప్పున మళ్లీ ఓ 21 వేలు అయ్యింది. పిండి బస్తాలకు రూ.9 వేలు, రెండుసార్లు పంటలకు కొట్టిన పురుగు, తెగులు నివారణ మందులకు రూ.10 వేలు. నీళ్లు లేక బోర్లు వట్టిపోయి పంట ఎండిపోయింది. మిగిలిన మూడెకరాలను కాపాడుకుందామనుకుంటే 12 గంటలు కూడా సక్కగ త్రీఫేజ్ కరెంటు ఇస్తలేరు. అరగంట కరెంటు ఇస్తే గంట కోస్తున్నరు. ఇందులోనే 8 సార్లు కరెంటు వస్తది, పోతది. లో ఓల్టేజీ వల్ల ఉన్న ఒక్క మోటారు కూడా కాలిపోయింది. చుట్టుపక్కల చెరువుల్లో నీళ్లు లేక బావులు ఎండిపోయినయ్, బోర్లు ఇంకిపోయినయ్. ఈ మూడెకరాలు కూడా కాపాడుకోకపోతే పెళ్లాం, పిల్లలను ఎట్లా సాదాలి? ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. గత పదేండ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు.
– మండల శంకర్, రైతు, ఓగోడు (నకిరేకల్ మండలం)
నాకున్న మూడెకరాల్లో వరి సాగు చేసిన. నాట్లు పెట్టినప్పుడు నీళ్లు బాగానే వచ్చినయ్. తీరా పంట పొట్ట దశకు వచ్చి 16 రోజులవుతున్నా కూడా డీ-40 కాల్వ ద్వారా నీళ్లు అందలేదు. ఎండలకు ఉన్న బోరులో కూడా నీళ్లు అడుగంటి ఒక ఎకరమే పారుతున్నది. మిగతా రెండెకరాలు పూర్తిగా ఎండిపోవడంతో గొర్లు మేపుతున్నా. మూడెకరాలకు రూ.60వేల దాక ఖర్చయ్యింది. ఇప్పటికైనా అధికారులు డీ-40 కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.
– శ్రీనునాయక్, రైతు, సీత్యాతండా (మాడ్గులపల్లి మండలం)
నాకున్న రెండెకరాల భూమిలో పత్తి పంట వేశాను. మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని వరి పొలం చేస్తున్నా. ఈ యాసంగి ఒక్కసారిగా నీళ్లు అడుగంటి బోర్లు పోయకపోవడంతో మూడెకరాల వరి ఎండిపోయింది. చేసేది లేక అందులో పశువులను మేపుతున్నా. నీళ్లు అందకుంటే ఉన్న మూడెకరాలు కూడా ఎండి పోయేట్టు ఉంది. దాంతో మూడు బోర్లు వేస్తే ఒక్క బోరు మాత్రం అంతంత మాత్రం పడ్డది. పెట్టుబడి కూడా దక్కుతదో, లేదో అన్నట్లు తయారైంది మా పరిస్థితి.
-కాసార్ల మల్లారెడ్డి, కౌలు రైతు, అప్పాజీపేట (నల్లగొండ రూరల్)