ఎటుచూసినా వట్టిపోయిన బోర్లు, అడుగంటిన బావులు.. నెర్రెలు బారిన నేలలు.. పొట్ట మీద ఎండుతున్న పంటలు.. రైతన్న మొహంలో తన్నుకొస్తున్న దుఃఖం.. ఇవీ యాదాద్రి భువనగిరి జిల్లాలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు. జిల్లాలో సాగు నీటి కోసం రైతులు అరిగోస తీస్తున్నారు. పొట్ట దశలో ఉన్న వరి పంటలను కాపాడుకునేందుకు నానా యాతన పడుతున్నారు. భూగర్భ జలాలు ఇంకి బోర్లు పోయకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. లక్షలకు లక్షలు పెట్టి బోర్లు వేస్తున్నా చుక్క నీరు పడడం లేదు.
– యాదాద్రి భువనగిరి, మార్చి 4 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో కొన్నేండ్లుగా భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. ఏటా గంగమ్మ పైకి ఉబికి వచ్చింది. నాలుగు నుంచి ఐదు మీటర్ల లోతులోనే నీటి మట్టం ఉండేది. కానీ ఈ ఏడాది చెరువులు, చెక్‌డ్యామ్‌లు ఎండిపోవడంతోపాటు పలు కారణాలతో భూగర్భ జలాలు ఇంకిపోయాయి. ఫిబ్రవరిలో సగటున 10.95 మీటర్ల కిందకు వెళ్లాయి. గతేడాది కంటే ఈసారి 2.36 మీటర్ల మేర అధికంగా పడిపోయాయి. జిల్లాలోని 17 మండలాల్లో జలమట్టం గణనీయంగా తగ్గిపోయింది. సంస్థాన్ నారాయణపురంలో అత్యధికంగా 23.09 మీటర్ల లోతుకు చేరాయి. ఆత్మకూరు (ఎం)లో 18.18 మీటర్లు, బొమ్మలరామారంలో 14.06, భువనగిరిలో 12.61, రామన్నపేటలో 12.36, బీబీనగర్‌లో 12.31, ఆలేరులో 11.96, తుర్కపల్లిలో 11.76, మోటకొండూరులో 11.36 మీటర్ల దూరాన భూగర్భ జలాలు ఉన్నాయి.
జిల్లా రైతాంగం వ్యవసాయానికి బోర్లు, బావులే ప్రధాన ఆధారం. ప్రస్తుతం భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. కొంత కాలం నుంచి పుష్కలంగా నీళ్లు ఉండడంతో జోరుగా పోసిన బోర్లన్నీ ఎండిపోతున్నాయి. దాంతో చేతికి వచ్చే సమయంలో పంటలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు వేస్తున్నా చుక్క నీరు పడడం లేదు. కొన్నిచోట్ల 700 నుంచి 800 ఫీట్ల లోతుకు తవ్వినా ఫలితం ఉండడం లేదు. ఒక్కో రైతు రెండు నుంచి నాలుగైదు బోర్లు వేస్తున్నా ప్రయోజనం శూన్యం. ఒక్కో బోరుకు రూ.లక్ష దాకా ఖర్చు అవుతున్నది. ఈ లెక్కన రెండు నుంచి లక్షలు లక్షల వరకు వెచ్చిస్తున్నా నీళ్లు పడకపోవడంతో బోరున విలపిస్తున్నారు. చాలామంది రైతులు అప్పులు చేసి మరీ బోర్లు వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం అందించకపోవడంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారు. మరోవైపు పంటలు ఎండిపోతుండడంతో కుంగిపోతున్నారు. చాలాచోట్ల ఎండుతున్న వరి పైర్లలో పశువులను మేపుతున్నారు. మరికొన్ని చోట్ల రైతులు వాటర్ ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు రూ.వెయ్యి వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలా ఎన్ని ట్యాంకర్లు పోస్తే అన్ని వేలు అవుతున్నాయి. రైతు అవస్థలపై ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని, చెరువులు నింపితే ఇంత దుర్భర పరిస్థితి ఉండదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే సర్కారు పట్టించుకోని మిగిలిన కొద్దిపాటి పంటలైనా కాపాడాలని వేడుకుంటున్నారు.
నెర్రెలు వారిన పంట పొలాన్ని చూపుతున్న ఈ యువ రైతు పేరు నాగెల్లి రమేశ్. గుండాల మండల కేంద్రం. రమేశ్ తనకున్న రెండెకరాలతోపాటు మరో మూడెకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేశాడు. పంట ఈనె దశలో నీళ్లు అందడం కష్టంగా మారింది. దాంతో అప్పు చేసి 5 బోర్లు వేశాడు. ఒక్కదాంట్లోనూ చుక్క నీరు పడలేదు. నాలుగెకరాల పూర్తిగా ఎండిపోయింది. ప్రభుత్వం నవాబ్‌పేట రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించి చెరువులు నింపితే ఈ పరిస్థితి ఉండేది కాదని నరేశ్ వాపోతున్నాడు. ఇప్పటికైనా నీళ్లు ఇచ్చి మిగిలిన కొద్దిపాటి పంటలను కాపాడాలని, రైతులను ఆదుకోవాలని కోరుతున్నాడు.
గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన రైతు ఎగమాటి విద్యాసాగర్‌రెడ్డి ఆరెకరాల్లో వరి పెట్టాడు. ప్రభుత్వం నవాబ్‌పేట రిజర్వాయర్ నుంచి నీళ్లు ఇస్తుందని ఆశ పడ్డాడు. తీరా పంట పొట్టకు వచ్చాక భూగర్భజలాలు అడుగంటి బోర్లు నీళ్లు పోయడం బంద్ అయ్యింది. వరి పైరు ఎండిపోతుండడంతో లక్ష రూపాయలు ఖర్చు చేసి మరో 3 బోర్లు వేశారు. ఏ ఒక్క దాంట్లోనూ నీళ్లు పడలేదు. పంట పశువుల మేతకు తప్ప దేనికీ పనికి రాన్నట్టున్నదని విద్యాసాగర్‌రెడ్డి వాపోయాదు. ఇప్పటి వ్యవసాయం పరిస్థితులు చూస్తే దుఃఖం తన్నుకొస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం నవాబ్‌పేట రిజర్వాయర్ ద్వారా సాగునీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.
మోటకొండూరు మండలంలోని బెజ్జంకి బావి. పంట సాగు కోసం తన పొలంలో ఏడు బోర్లు వేశాడు. అందుకుగానూ రూ.2.50లక్షలకుపైగా ఖర్చు చేశాడు. ప్రస్తుతం భూగర్భ జలాలు పడిపోవడంతో ఒక్క బోరు కూడా నీళ్లు పోయడంలేదు. గతంలో నాలుగు ఎకరాల భూమి పారగా, ఇప్పుడు 10 గుంటలకు కూడా నీళ్లు చాలడం లేదు. తన పొలంతోపాటు మరో ఇద్దరు రైతుల నుంచి కౌలుకు తీసుకున్న 12 ఎకరాల్లో వరి ఎండిపోయింది. దాంతో చేసిదిలేక ఎకరాకు ఏడు వేల రూపాయల లెక్కన గొర్రెల మేతకు వదిలిపెట్టినట్టు రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.