కట్టంగూర్, మే 17 : పచ్చిరొట్ట విత్తనాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ మండల వ్యవసాయ అధికారి గిరి ప్రసాద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రంలో వచ్చిరొట్ట విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కట్టంగూర్, ఈదులూరు ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లో రాయితీపై విత్తనాలు అందించడం జరుగుతుందన్నారు.
పచ్చి రొట్టె విత్తనాలైన జనుము, జీలుగు వాడడం వల్ల భూసారం పెరుగడంతో పాటు పంటలకు అధిక లాభాలు చేకూరుతాయన్నారు. 50 శాతం రాయితీపై లభించే 30 కిలోల జీలుగ బస్తాకు రూ.2,137 ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన రైతులు తమ ఆధార్ కార్డు, భూమి పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా జీరాక్స్ తో వచ్చి విత్తనాలను తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ నూక సైదులు, ఏఈఓలు పరశురాములు, నవీన్, మురళి, రైతులు కొప్పు వెంకన్న, బెజవాడ రామకృష్ణ పాల్గొన్నారు.