యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాపై సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నది. జిల్లాల మధ్య వివక్ష చూపిస్తున్నది. ఒక్కో నియోజకవర్గాన్ని ఒక్కో విధంగా చూస్తున్నది. ఇందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాల మంజూరే నిదర్శనం. మంత్రులు ఉన్న చోట ఒకలా.. లేని చోట మరోలా కనిపెడుతున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాకు ఇంటిగ్రేటెడ్ గురుకులం ఎందుకు ఇవ్వరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్ట్ కింద గురుకులాలను ప్రకటించింది. అయితే మంత్రులు ఉన్న నియోజకవర్గానికి మాత్రమే గురుకులాలను ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు ఒక్కటీ మంజూరు చేయలేదు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంత్రి ఉన్న సూర్యాపేట జిల్లాకు మాత్రం రెండు గురుకులాలు శాంక్షన్ చేశారు. మంత్రి సొంత నియోజకవర్గమైన హుజూర్నగర్ పరిధిలో 20 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఇదే జిల్లాకు చెందిన తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో ఏర్పాటు కోసం 24 ఎకరాల స్థలాలను పరిశీలించారు. నల్లగొండకు చెందిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తన నియోజకవర్గానికి, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ గురుకులాన్ని మంజూరు చేయించుకున్నారు. నల్లగొండ నియోజకవర్గంలో 20 ఎకరాలను గుర్తించి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించారు. కానీ యాదాద్రి భువనగిరికి మాత్రం మొండిచెయ్యి చూపించారు. ఈ జిల్లాను పట్టించుకోకుండా వివక్షను ప్రదర్శిస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో తుంగతుర్తి, హుజూర్నగర్, నల్లగొండ, మునుగోడు, దేవరకొండ మినహా మిగతా 7 నియోజకవర్గాలపై చిన్నచూపే చూపించారు. అన్ని అసెంబ్లీ పరిధుల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి.
ఆయా గురుకులాల నిర్మాణ పనులకు శుక్రవారం ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేయనున్నారు. ఒక్కో గురుకులానికి రూ.200 కోట్ల వరకు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీలకు చెందిన నాలుగు పాఠశాలలు ఈ భవనంలో ఉంటాయి. ఆయా పాఠశాలలను సకల సదుపాయాలతో నిర్మించనున్నారు. ప్రాంగణంలో టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణం, గ్రీన్ క్యాంపస్, సోలార్ విండ్ ఎనర్జీ సదుపాయాలు, ల్యాబ్‌లు, కంప్యూటర్ సెంటర్, లైబ్రరీ, ఆడిటోరియం, ఇండోర్ స్పోర్ట్స్, జిమ్, ల్యాండ్ స్కేప్ కోర్టులు తదితర సదుపాయాలు ఉండనున్నాయి. ఒక్కో గురుకులంలో 2,560 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. 120 మంది టీచర్లు పనిచేయనున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రులు ఉన్న చోటనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు మంజూరు చేశారు. మరి యాదాద్రి భువనగిరి జిల్లా ఏం పాపం చేసింది. సూర్యాపేటకు రెండు ఇచ్చినప్పుడు.. మా జిల్లాకు ఒక్కటైనా ఇవ్వాలి కదా..? గురుకులాలు అందుబాటులోకి వస్తే ఎన్నో సదుపాయాలు కలుగుతాయి. సర్కారు ఫలాలు మా జిల్లా ప్రజలకు ప్రభుత్వం ఇవ్వదల్చుకోలేదా..? దీనిపై ప్రభుత్వం నిర్ణయం సబబుగా లేదు. అన్ని నియోజకవర్గాలకు డిమాండ్ వస్తున్న నేపథ్యంలో అన్నింటికీ ఒకేసారి మంజూరు చేయాలి.
– జక్కిడి నగేశ్, బీఆర్ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి