చండూరు, మార్చి 27 : నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో గ్రామ కంఠం భూములు కబ్జాకు గురవుతున్నాయని, ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో సర్వే చేసి ఆ భూములను కాపాడాలని సీపీఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. ఈ మేరకు గురువారం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసీల్దార్ దశరథకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు, పింఛన్, ఇందిరమ్మ ఇల్లు, ఇండ్ల స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి అందించాలని కోరారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టాలన్నారు. గతంలో పల్లె వెలుగు బస్సులు నడిపి నిలిపివేసిన ప్రతి గ్రామానికి బస్సు సర్వీసులను పునరుద్ధరించాలన్నారు.
మండలంలోని అన్ని గ్రామాలకు మరో మండలానికి లింకు రోడ్ల నిర్మాణం , నూతనంగా బీటు రోడ్ల నిర్మాణంకు నిధులు మంజూరు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలన్నారు. లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, వెంకటేశం, ఈరటి వెంకటయ్య, స్వామి, బల్లెం వెంకన్న, రాజు, బుర్కల రామలింగం, బుర్కల నాగేశ్, బొమ్మరగోని యాదయ్య పాల్గొన్నారు.