దామరచర్ల, ఏప్రిల్ 12: దామరచర్ల మార్కెట్ యార్డులో లారీల కొరతవల్ల కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి. మండలంలో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఈనెల 6న మండలంలో 8 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు గతనెల 10వ తేదీ నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చి నిల్వ చేసుకున్నారు. అధికారులు ఆలస్యంగా కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించగా లారీలు రోజుకు ఒకటి రెండు మాత్రమే రావడంతో కాంటాలు వేయడంలో ఆలస్యం అవుతోంది.
వేసవి కాలం కావడంతో ధాన్యం మ్యాచర్ కూడా త్వరగా వస్తున్న క్రమంలో రైతులు కాంటాల కోసం ఎదురు చూస్తున్నారు. మిర్యాలగూడలోని మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో ఆలస్యం చేస్తుండటం వల్ల లారీల యాజమానులు ఇబ్బందులు పడుతున్నారు. మిల్లర్లు దిగుమతి చేసుకోక పోవడంతో రోజుల తరబడి మిల్లుల వద్ద వేచి ఉండటం వల్ల ధాన్యం తరలించేందుకు లారీ యాజమానులు ముందుకు రావడం లేదు. కొనుగోలు కేంద్రాల వద్దకు సన్నాలు, దొడ్డు రకాల ధాన్యం అధికంగా రావడంతో కాంటాలు ఆలస్యం అవుతోంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానలు పడితే ధాన్యం తడిసి నష్టపోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.