మోత్కూరు/గుర్రంపోడ్/నాగారం/ఆలేరు రూరల్, ఏప్రిల్10 : అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. ఉమ్మడి జిల్లాలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం తీవ్ర నష్టం కలిగించింది. కొనుగోళ్లు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. పలుచోట్ల వరదకు కొట్టుకుపోయింది. వారం రోజుల్లో కోతకు వచ్చిన వరిపొలాలు వర్షానికి నేలవాలాయి. చేతికి అంది వచ్చిన ధాన్యం తడవడం, కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మోత్కూరు, ఆత్మరూర్(ఎం), గుండాల, అడ్డగూడూరు, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో వర్షానికి ధాన్యం తడిసింది. నాగారం మండలం వర్ధమానుకోటలో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. గుర్రంపోడు మండలంలో వర్షానికి ధాన్యం తడిసింది. ఆమలూరు గ్రామంలో పిడుగుపాటుకు గొర్రెల కాపరి మేకల చిన్న రాములు(65) మృతిచెందాడు. ఆలేరు మండలం మంతపురిలో పిడుగుపడి పాడిగేదె మృత్యువాత పడింది.
Nalgonda
మధ్యాహ్నం ఎండ.. సాయంత్రం వాన
భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 11 : వాతావరణంలో విచిత్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గురువారం జిల్లాలో 40 డిగ్రీలకుపైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రతకు జనం బయటకు వెళ్లేందుకు భయపడ్డారు. ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. కానీ సాయంత్రం వచ్చే సరికి వాతావరణం చల్లబడింది.
ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో 40.9, సంస్థాన్ నారాయణపురంలో 40.8, సగటున 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం తర్వాత పలు మండలాల్లో వర్షం కురిసింది. ఆలేరు మండలం శారాజీపేటలో 20.5, అడ్డగూడూరులో 10.8, ఆత్మకూరు (ఎ0)లో 8.8, గుండాలలో 6.3, యాదగిరిగుట్టలో 4, మోటకొండూరులో 2.5, మోత్కూరు దత్తప్పగూడెంలో 1 మిల్లీమీటర్ల వర్షం పడింది.