సర్కారు నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికే సరిపడా సాగునీరు అందక వేల ఎకరాల్లో పంటలు ఎండిపోగా.. చేతికొచ్చిన అరకొర ధాన్యానికి కూడా మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ప్రారంభించినా కొనుగోళ్లు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు మద్దతు ధర కన్నా తక్కువ రేటు వస్తున్నా విధిలేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకుంటున్నారు.
– యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ)
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్లో 2.80లక్షల ఎకరాల్లో రైతులు వరి వేశారు. మొత్తంగా 6.5లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగున్నర లక్షల టన్నుల వడ్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం జిల్లాలో 324 పీపీసీలను(ధాన్యం కొనుగోలు కేంద్రాలు) ప్రారంభించాలని ప్రతిపాదించారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు 212 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అయినా 4వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. అనేక చోట్ల కేంద్రాలు ప్రారంభించినా.. కొనుగోళ్లలో జాప్యం నెలకొంది. దాంతో కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ పోసిన ధాన్యం అక్కడే కుప్పలుగా దర్శనమిస్తున్నాయి.
ప్రైవేట్లో భారీగా..
కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో రైతులు కేంద్రాల్లోనే నిరీక్షిస్తున్నారు. ఇటీవల వరుసగా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో వందల ఎకరాల్లో పంట దెబ్బతింది. కొన్నిచోట్ల ధాన్యం తడిసి ముద్దయ్యింది. దాంతో రైతులు ధాన్యాన్ని వెంటనే అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభు త్వ కొనుగోలు కేంద్రాల్లో సేకరణ ఆలస్యం కావడంతో ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేట్లో రూ. 1,800 నుంచి రూ.2వేల వరకు మాత్ర మే ధర వస్తున్నది.
ఆత్మకూరు (ఎం) మండలంలో రూ.1,750 మాత్రమే అందుతున్నది. ప్రభుత్వం ఏ-గ్రేడ్ ధాన్యానికి క్వింటా రూ.2,320 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ప్రైవేట్లో వ్యాపారులు 20,004 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. ఆలేరు మార్కెట్ యార్డు పరిధిలో 631మెట్రిక్ టన్నులు, భువనగిరిలో 1010, చౌటుప్పల్లో 2349, మో త్కూరులో 750, వలిగొండలో 15,264 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. సీఎంఆర్ తక్కువగా ఉన్నవాళ్లు మిల్లర్లు ధా న్యం కొనుగోలు చేసి సర్దుబాటు చేసుకుంటున్నారు.
కష్టాల ఎవుసం..
జిల్లాలో పదేండ్ల కాలంలో ఎన్నడూ లేనివిధంగా కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు పడిపోయాయి. సర్కారు అలసత్వంతో చెరువులు, బోరుబావులు ఎండిపోయాయి. దాంతో సాగు నీటికి రైతులు అష్టకష్టాలు పడ్డారు. అనేక చోట్ల పొట్ట దశలోనే పంటలు ఎండిపోయాయి. చేతికొచ్చిన మిగిలిన పంట కూడా సరిగ్గా కొనకపోవడంతో ప్రైవేట్ మిల్లుల వద్ద అమ్ముకోవాల్సి పరిస్థితి ఎదురవుతున్నది. ఫలితంగా క్వింటాకు రూ.300 నుంచి 500 వరకు నష్టపోవాల్సి వస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోళ్ల వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోలు కేంద్రం లేక రూ.30వేలు నష్టం
నా పొలంలో 87 బస్తాల వడ్ల దిగుబడి వచ్చింది. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్లో క్వింటా రూ.1,800 చొప్పున దళారీకి అమ్మాను. సుమారు 30 వేల నష్టం వాటిల్లింది. గతంలో కంచనపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టేవారు. ఈసారి ఏర్పాటు చేయలేదు.
-డేగల పాండరి, రైతు, కంచనపల్లి గ్రామం, వలిగొండ మండలం
ప్రైవేట్లో కొనుగోళ్లు ఇలా.. (మెట్రిక్ టన్నుల్లో..)
మార్కెట్ యార్డు : ధాన్యం
ఆలేరు : 631
భువనగిరి : 1010
చౌటుప్పల్ : 2,349
మోత్కూరు : 750
వలిగొండ : 15,264
మొత్తం : 20,004