దేవరకొండ రూరల్, మే 16 : రాష్ట్రంలో అకాల వర్షాలతో కష్టపడి పండించిన పంట నీటి పాలవుతూ రైతులు ఆవేదన చెందుతున్నారని, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన జాతీయ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. దేశాన్ని కార్పొరేటర్లకు తాకట్టు పెట్టి దివాళ చేయించారన్నారు. మోడీ నమ్మినబంటు అదానీకి ప్రభుత్వ రంగ సంస్థలు కట్టుబెట్టడానికి కుట్ర చేస్తున్నట్లు తెలిపారు.
విపక్ష నాయకులపై సీబీఐ, ఈడీ దాడులు చేస్తున్న ప్రభుత్వం అదానీపై ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణపై ప్రధాని మోదీ నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తూ విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, సుదర్శన్ రెడ్డి, బుచ్చిరెడ్డి, కనకాచారి, మైనుద్దీన్ పాల్గొన్నారు.