దేవరకొండ రూరల్, మే 28 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. బుధవారం దేవరకొండలోని పల్లా పర్వంత్ రెడ్డి భవన్లో జరిగిన పార్టీ మండల కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవరకొండ నియోజకవర్గంలో ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. వానాకాలం ప్రారంభమైనందున వర్షాలకు ధాన్యం తడిచి రైతులు నష్టపోతారు కావున లారీలు, హమాలీలను ఎక్కువగా వినియోగించి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేపట్టాలన్నారు.
మిల్లర్లు తాలు పేరుతో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, ఇలాంటి సమస్యలు ఉన్న చోట కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచి నకిలీ విత్తనాలు మార్కెట్లో చలామణి కాకుండా చూడాలన్నారు. అలాగే పెట్టుబడి సాయంగా రైతులకు వెంటనే రైతు బంధు విడుదల చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.