కట్టంగూర్, ఏప్రిల్ 30 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని నల్లగొండ జిల్లా కట్టంగూర్ తాసీల్దార్ గుగులోతు ప్రసాద్ నిర్వాహకులకు సూచించారు. బుధవారం మండలంలోని అయిటిపాముల గ్రామంలో గల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి అధికారులు, రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించి వివరాలను ట్యాబ్లో నమోదు చేయాలన్నారు.
మిల్లుల్లో వెంటనే ధాన్యం దిగుమతులు అయ్యే విధంగా, లారీల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాంటాలో లేడా వస్తే నిర్వాహకులు, అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు తమ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలన్నారు. కేంద్రాల్లో గోనె సంచులు, పట్టాలు అందుబాటులో ఉంచి రైతులకు సౌకర్యాలను కల్పించాలని నిర్వాహకులకు సూచించారు.