నీలగిరి, మే 09 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యే బాలు నాయక్తో కలిసి కలెక్టర్ డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో 15 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 457 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మొత్తం 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని ముందస్తు అంచనా వేసినట్లు చెప్పారు. మిగిలిన ధాన్యం కొనుగోళ్లు వచ్చే 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం అమ్మిన రైతులకు చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయని, ఇప్పటివరకు రూ.487 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. దేవరకొండ డివిజన్ పరిధిలోని 12 మిల్లులకు చెందిన మిల్లర్లు ధాన్యం సేకరణలో పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలన్నారు. అదనంగా 30 లారీలను పెంచామని, ప్రస్తుతం మొత్తం 100 లారీలతో 24 గంటల వ్యవధిలో ధాన్యం అన్లోడింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్ష సమావేశానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ ఇన్చార్జి ఆర్డీఓ రమణారెడ్డి, డీఎస్ఓ వెంకటేష్, డీఎం రాంపత్తి నాయక్, డీసీఓ పత్యా నాయక్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, తాసీల్దార్ మధుసూదన్ రెడ్డి, డీటీ ముబీన్, రైస్ మిల్లర్ల తరఫున వెంకన్న, శ్రీనివాస్, అధికారులు హాజరయ్యారు.