అర్వపల్లి, మే 27 : ధాన్యం కాంటా వేసిన బస్తాలను మిల్లులకి వేగవంతంగా తరలించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని, తిమ్మాపురం-1 ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లారీలను సర్దుబాటు చేసి కొనుగోలు కేంద్రాలకి పంపుతామని, నేడు సాయంత్రం లోపు కాంటా వేసిన బస్తాలను మిల్లులకి తరలించాలని సూచించారు. అకాల వర్షాలకి వడ్లు తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని, ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసుకుని వెంటనే ధాన్యం లారీలకి లోడ్ చేయాలన్నారు.
ఆయా కేంద్రాల్లో రికార్డులను పరిశీలించి ఎన్ని లోడ్లు తరలించారని నిర్వాహకులని అడిగి తెలుసుకున్నారు. జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం ఐకేపీ నుండి 8 వేల క్వింటాలు, తిమ్మాపురం-1 నుండి 16,950 క్వింటాల ధాన్యం మిల్లులకి ఎగుమతి చేయడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం ప్రసాద్, తాసీల్దార్ యాదగిరి, ఎంపీడీఓ గోపి, సంఘం సభ్యులు, రైతులు ఉన్నారు.