– ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి
– విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య
కోదాడ, ఏప్రిల్ 28 : రాష్ట్రంలోని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కోదాడ పట్టణం పెన్షనర్స్ భవనంలో ఏప్రిల్ నెలలో జరుపుకునే విశ్రాంత ఉద్యోగుల జన్మదిన వేడుకలను సామూహికంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం ప్రభుత్వానికి సేవలు అందించి విశ్రాంతి తీసుకుంటున్న వారిని ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. గత 20 ఏళ్ల క్రితం పరిస్థితి చూస్తే ఉద్యోగి రిటైర్ కావడానికి నాలుగు రోజుల ముందే రావాల్సిన అన్ని బకాయిలు చేతికి వచ్చేవి కానీ, నేడు రిటైర్ అయ్యి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడం దురదృష్టకరం అని మండిపడ్డారు.
సకాలంలో రిటైర్మెంట్ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది విశ్రాంత ఉద్యోగులు మనోవేదనకు గురవుతున్నారని, ఇది వారి ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న బకాయిలన్నింటినీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, కోదాడ యూనిట్ కార్యదర్శి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి వేనేపల్లి శ్రీనివాసరావు తమ్మన బోయిన వీరబాబు, అసోసియేట్ అధ్యక్షుడు జానయ్య, గులాం ఎస్దాని, భ్రమరాంబ, బాలేమియా, హాజీ నాయక్, భూపాల్ రెడ్డి, జగన్మోహన్ రావు పాల్గొన్నారు.