– ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడింది
– నల్లగొండ జిల్లా కేంద్రంలోని మాన్యంచెలకలో స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
రామగిరి, జూన్ 10 : అందరికీ నాణ్యమైన విద్యను అందించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. అదేవిధంగా తమ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్, అభ్యున్నతికి కృషి చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మాన్యంచెల్కలో రూ.44 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా నిర్మించనున్న ఉర్దూ మీడియం ప్రైమరీ పాఠశాల నిర్మాణ పనులు రేపటి నుండి ప్రారంభమవుతాయని, అవసరమైతే కోటి రూపాయల వరకు ఖర్చు చేసి మంచి భవనాన్ని నిర్మిస్తామని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని అన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉర్దూను రెండవ భాషగా చేయడం జరిగిందని, సచార్ కమిటీ సిఫారసుల మేరకు ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు.
ఈ అవకాశాన్ని ముస్లిం మైనార్టీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముస్లిం మైనార్టీలకు 10 కోట్ల రూపాయలతో షాదీఖానా నిర్మించనున్నామని, పట్టణ ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే కార్పొరేటర్ల దృష్టికి తీసుకురావాలని, లేదంటే తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. పేద ముస్లిం మైనార్టీలకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని, అలాగే ఎక్కడైనా స్థలం ఉంటే ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎంఏ ఆఫీస్ ఖాన్, డీఈఓ సుశీంద్ర రావు, మౌలానా సిద్ధికి, బషీర్, అక్బర్ ఖాన్ ఉన్నారు.

నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి